మార్కు సువార్త 8
8
నాలుగు వేలమందికి ఆహారం పెట్టిన యేసు
1ఆ రోజుల్లో మరొక పెద్ద గుంపు గుమికూడింది. అయితే వారు ఏమి తినలేదు, కాబట్టి యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, 2“ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది. 3నేను వీరిని ఆకలితో ఇళ్ళకు పంపితే, వారు దారిలో సొమ్మసిల్లిపోతారు ఎందుకంటే కొందరు దూరం నుండి వచ్చారు” అని చెప్పారు.
4అందుకు ఆయన శిష్యులు, “కాని ఇంత మందికి భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు.
5యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు.
వారు, “ఏడు” అని జవాబిచ్చారు.
6యేసు ఆ జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించారు. ఆ ఏడు రొట్టెలను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి జనసమూహానికి పంచిపెట్టుమని తన శిష్యులకు ఇచ్చారు, వారు పంచిపెట్టారు. 7వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడ ఉన్నాయి; ఆయన వాటిని కూడ ఆశీర్వదించి, పంచిపెట్టుమని తన శిష్యులకు చెప్పారు. 8ప్రజలు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు. 9తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే, 10ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా అనే ప్రాంతానికి వెళ్లారు.
11పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడానికి, ఆకాశం నుండి ఒక సూచన చూపించుమని వారు ఆయనను అడిగారు. 12అందుకు ఆయన ఆత్మలో దీర్ఘ నిట్టూర్పు విడిచి, “ఈ తరం వారు నన్ను ఎందుకు సూచన అడుగుతున్నారు? వారికి ఏ సూచన ఇవ్వబడదని నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను” అని వారితో అన్నారు. 13తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డున చేరుకొన్నారు.
పరిసయ్యులు హేరోదు యొక్క పులిసిన పిండి
14శిష్యులు తమతో రొట్టెలను తెచ్చుకోవడం మరచిపోయారు, పడవలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమి లేదు. 15యేసు వారితో, “పరిసయ్యుల హేరోదు వెంబడించేవారి పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి” అని వారిని హెచ్చరించారు.
16వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
17వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికీ మీరు చూడలేకపోతున్నారా లేదా గ్రహించలేదా పోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా? 18మీరు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా? 19నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?” అని వారిని అడిగాడు.
అందుకు వారు, “పన్నెండు” అని చెప్పారు.
20“నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?” అని ఆయన వారిని అడిగారు.
అందుకు వారు, “ఏడు” అని జవాబిచ్చారు.
21అప్పుడు ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా?” అన్నారు.
బేత్సయిదా దగ్గర గ్రుడ్డివానికి చూపునిచ్చిన యేసు
22వారు బేత్సయిదాకు వచ్చినప్పుడు, కొందరు ఒక గ్రుడ్డివానిని తీసుకువచ్చి వానిని ముట్టుమని ఆయనను బ్రతిమాలారు. 23ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లి, వాని కళ్ల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనబడుతుందా?” అని అడిగారు.
24అందుకు వాడు తల పైకెత్తి చూస్తూ, “మనుష్యులు కనపడుతున్నారు, వారు చెట్లలా నడుస్తున్నారు” అని చెప్పాడు.
25యేసు మళ్ళీ తన చేతులు వాని కళ్ల మీద ఉంచారు. అప్పుడు వాని కళ్లు తెరువబడ్డాయి, వాడు చూపు పొందుకొని, అన్నిటిని స్పష్టంగా చూడగలిగాడు. 26యేసు వానితో, “నీవు ఊరిలోనికి వెళ్లకుండా ఇంటికి వెళ్లు” అని చెప్పి వానిని పంపివేశారు.
యేసే క్రీస్తు అని చెప్పిన పేతురు
27యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు.
28అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారు” అన్నారు.
29ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు.
పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు.
30అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పకూడదని వారిని హెచ్చరించారు.
తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
31ఆ తర్వాత యేసు, మనుష్యకుమారుడు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడి, అనేక హింసలు పొంది, చంపబడి, మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు. 32ఆయన ఈ మాటను స్పష్టంగా చెప్పారు, కాబట్టి పేతురు ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు.
33కాని యేసు తన శిష్యులవైపు తిరిగి వారిని చూసి, పేతురును, “సాతానా, నా వెనుకకు పో! నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అని గద్దించారు.
సిలువ మార్గము
34ఆ తర్వాత యేసు జనసమూహంతో పాటు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా చెప్పారు: “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. 35ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు. 36ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? 37ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? 38ఈ వ్యభిచార, పాపిష్ఠి తరం మధ్యలో నా గురించి గాని, నా మాటల గురించి గాని ఎవరైనా సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.”
Селектирано:
మార్కు సువార్త 8: TSA
Нагласи
Сподели
Копирај

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.