Лого на YouVersion
Икона за пребарување

మార్కు సువార్త 4

4
విత్తేవాని ఉపమానం
1యేసు మరల సరస్సు ఒడ్డులో బోధించడం మొదలుపెట్టారు. ఆయన చుట్టూ ఉన్న గుంపు పెద్దగా ఉండడం వల్ల ఆయన సరస్సులో ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు. 2ఆయన ఉపమానాలతో అనేక విషయాలను వారికి బోధిస్తూ ఈ విధంగా చెప్పారు: 3“ఇటు వినండి! ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. 4అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. 5మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి, మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి. 6కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. 7మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి, కాబట్టి అవి పంటను ఇవ్వలేదా పోయాయి. 8మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, ఎదిగి, కొన్ని ముప్పైరెట్లు, కొన్ని అరవైరెట్లు, కొన్ని వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.”
9అప్పుడు యేసు, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
10ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ పన్నెండు మందితో పాటు ఆయన చుట్టూ ఉన్న కొందరు ఉపమానాల గురించి ఆయనను అడిగారు. 11అందుకు ఆయన ఈ విధంగా చెప్పారు, “దేవుని రాజ్యం గురించిన మర్మానికి సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది. కాని బయటివారికి ప్రతి విషయం ఉపమాన రీతిగానే చెప్పబడింది. 12తద్వారా,
“ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు,
ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు;
లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొంది ఉండేవారు!’#4:12 యెషయా 6:9,10
13తర్వాత యేసు వారితో, “మీరు ఈ ఉపమానం అర్థం చేసుకోలేదా? అలాగైతే ఇతర ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు? 14రైతు వాక్యం విత్తుతున్నాడు. 15కొందరు దారి ప్రక్కన పడిన విత్తనంలాంటి వారు, అక్కడ వాక్యం విత్తబడింది. వారు వినిన వెంటనే, సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. 16మరికొందరు, రాతి నేలలో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు. 17అయితే వారిలో వేరు లేకపోవడంతో, వారు కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు, వారు త్వరగా పడిపోతారు. 18ఇంకా ఇతరులు ముళ్ళపొదల్లో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు. 19కాని జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనమోసం ఇతర కోరికలు ఆ వాక్యాన్ని అణచివేసి, ఫలించకుండా చేస్తాయి. 20ఇక మిగిలిన వారు, సారవంతమైన నేల మీద పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని అంగీకరిస్తారు, వారిలో కొందరు విత్తబడిన దానికి ముప్పైరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు వందరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.
దీపస్తంభంపై దీపం
21ఆయన వారితో, “మీరు దీపాన్ని తెచ్చి పాత్ర క్రింద లేదా మంచం క్రింద పెడతారా? దాన్ని దీపస్తంభం మీద పెట్టరా? 22ఎందుకంటే రహస్యంగా ఉంచబడింది బయటకు తేబడాలి, దాచిపెట్టబడింది బహిర్గతం కావాలి. 23వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అన్నారు.
24ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు వింటున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత లేదా అంతకన్నా ఎక్కువ కొలవబడుతుంది. 25కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, వారు కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది” అని చెప్పారు.
పెరిగే విత్తనం గురించిన ఉపమానం
26ఆయన ఇంకా వారితో, “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక మనుష్యుడు నేల మీద విత్తనం చల్లుతాడు. 27పగలు రాత్రి, అతడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా, అతనికి తెలియకుండానే, ఆ విత్తనం మొలిచి పెరుగుతుంది. 28భూమి దానంతట అదే మొదట మొలకను, తర్వాత కంకిని, అటు తర్వాత కంకి నిండా గింజలను పుట్టిస్తుంది. 29పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు కొడవలితో కోస్తాడు” అని చెప్పారు.
ఆవగింజ ఉపమానం
30ఆయన మళ్ళీ, “దేవుని రాజ్యం దేనిలా ఉంటుందని చెప్పగలం, దాన్ని వివరించడానికి ఏ ఉపమానాన్ని ఉపయోగించగలం? 31అది భూమిలోని విత్తనాలన్నింటిలో చిన్నదైన ఆవగింజ లాంటిది. 32అయినాసరే అది విత్తబడినప్పుడు, అది పెరిగి, పక్షులు గూళ్ళను కట్టుకోగలిగినంత పెద్ద కొమ్మలతో తోటలోని మొక్కలన్నిటి కంటే పెద్దదిగా ఎదుగుతుంది” అన్నారు.
33వారు అర్థం చేసుకోగలిగినంతవరకు, ఇలాంటి అనేక ఉపమానాలతో యేసు వారితో మాట్లాడారు. 34ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. తాను తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన వారికి అన్నిటిని వివరించేవారు.
తుఫానును శాంతింపచేసిన యేసు
35ఆ రోజు సాయంకాలమైనప్పుడు, ఆయన తన శిష్యులతో, “మనం సరస్సు దాటి అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నారు. 36జనసమూహాన్ని విడిచిపెట్టి, ఉన్నపాటుననే, ఆయన పడవ ఎక్కగా వారు ఆయనను తీసుకెళ్లారు. మరికొన్ని పడవలు కూడా వారి వెంట వెళ్లాయి. 37అప్పుడు భయంకరమైన తుఫాను రేగి, అలలు పడవ మీద ఎగసిపడ్డాయి, పడవ నీటితో నిండిపోసాగింది. 38యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకుని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు.
39ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది.
40ఆయన తన శిష్యులతో, “మీరు ఎందుకంతగా భయపడుతున్నారు? ఇప్పటికీ మీకు విశ్వాసం లేదా?” అన్నారు.
41వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.

Нагласи

Сподели

Копирај

None

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се