Лого на YouVersion
Икона за пребарување

యోహాను 13

13
చివరి రాత్రి భోజనం
మత్తయి 26:7-30; మార్కు 14:17-26; లూకా 22:14-29
1అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన ప్రేమించాడు. చివరి వరకూ ఆయన వారిని ప్రేమించాడు.
యేసు తన శిష్యుల పాదాలు కడగడం
2యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు. 3తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.
6ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. 7యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. 8పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు. 9సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు” అన్నాడు. 10యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు.
11ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. 12యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? 13మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.
16 నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు. 18మీ అందరి గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఎంపిక చేసిన వారు నాకు తెలుసు. అయితే, ‘నా రొట్టె తినేవాడు నాకు వ్యతిరేకంగా తన మడిమ ఎత్తాడు’ అన్న లేఖనం నెరవేరేలా ఈ విధంగా జరుగుతుంది. 19అది జరగక ముందే, ఇప్పుడు దీన్ని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు నేను ఉన్నవాణ్ణి అని మీరు నమ్మాలని నా ఉద్దేశం. 20నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. నేను పంపిన వాణ్ణి స్వీకరించిన వాడు నన్ను స్వీకరిస్తాడు. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపినవాణ్ణీ స్వీకరిస్తాడు.
తనను శత్రువులకు పట్టిస్తారని యేసు ముందుగా చెప్పడం
మత్తయి 26:20-25; మార్కు 14:17-21; లూకా 22:21, 22
21యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, “మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 22ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 23భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యుల్లో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడు. 24సీమోను పేతురు ఆ శిష్యుడికి, “యేసు ఎవరి గురించి అలా అన్నాడన్న విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకో” అని సైగ చేశాడు.
25ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకుని ఆయనతో, “ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు. 26అప్పుడు యేసు జవాబిస్తూ, “ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే” అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు. 27అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి” అన్నాడు. 28ఆయన అతనితో ఇలా ఎందుకు చెప్పాడో, బల్ల దగ్గర ఉన్నవాళ్ళకు తెలియలేదు. 29డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి యేసు అతనితో, “పండగకు కావలసినవి కొను” అని గాని, పేదవాళ్ళకు ఇమ్మని గాని చెప్పాడని వారిలో కొంతమంది అనుకున్నారు. 30అది రాత్రి సమయం. అతడు ఆ రొట్టె ముక్క తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.
31యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు. 32దేవుడు ఆయనలో మహిమ పరచబడినట్టయితే, తనలో ఆయనను మహిమ పరుస్తాడు. వెంటనే ఆయనను మహిమ పరుస్తాడు. 33పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.’ 34మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.
యేసును గురించి పేతురు చెప్పనున్న అబద్ధాన్ని గురించి యేసు ముందుగా చెప్పడం
మత్తయి 26:33-35; మార్కు 14:29-31; లూకా 22:33, 34
36సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “నేను వెళ్ళే స్థలానికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, కాని తరవాత వస్తావు” అన్నాడు. 37అందుకు పేతురు, “ప్రభూ, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను” అన్నాడు. 38యేసు జవాబిస్తూ, “నా కోసం ప్రాణం పెడతావా? నేను నీతో కచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు” అన్నాడు.

Селектирано:

యోహాను 13: IRVTel

Нагласи

Сподели

Копирај

None

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се