Logo ya YouVersion
Elilingi ya Boluki

లూకా 17

17
పాపం, విశ్వాసం, బాధ్యత
1యేసు తన శిష్యులతో, “ప్రజలను ఆటంకపరిచే శోధనలు తప్పకుండా వస్తాయి, కాని అవి ఎవరి వలన వస్తాయో, వానికి శ్రమ. 2ఎవడైనా ఈ చిన్నపిల్లలలో ఒకరికి ఆటంకంగా ఉండడం కన్నా, వాని మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వానికి మేలు. 3కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
“ఒకవేళ నీ సహోదరుడు గాని సహోదరి గాని నీ యెడల పాపం చేస్తే, వారిని గద్దించండి; ఆ తప్పు గురించి వారు పశ్చాత్తాపపడితే, వారిని క్షమించండి. 4ఒకవేళ వారు అదే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసినా సరే ఆ ఏడుసార్లు నేను చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అని నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి” అని అన్నారు.
5అప్పుడు అపొస్తలులు, “ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచండి!” అని అడిగారు.
6అందుకు ఆయన, “మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో నాటబడు’ అని చెప్పితే అది మీకు లోబడుతుంది.
7“మీలో ఎవనికైనా దున్నడానికి లేక మేపడానికి సేవకుడు ఉన్నాడనుకోండి. వాడు పొలంలో పని చేసి ఇంటికి రాగానే, అతని యజమాని, ఆ సేవకునితో, ‘భోజనం చేద్దాం రా అని వానిని పిలుస్తాడా?’ 8దాని బదులు, ‘ముందుగా నాకు భోజనం సిద్ధం చేసి, నీవు సిద్ధపడి నేను తిని త్రాగే వరకు నా సేవ చెయ్యి, ఆ తర్వాత నీవు తిని త్రాగవచ్చు’ అని చెప్పుతాడు గదా! 9తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా? 10అలాగే మీరు కూడా, మీకు అప్పగించబడిన పనులన్నింటిని చేసిన తర్వాత, ‘మేము యోగ్యత లేని సేవకులం; మా పని మాత్రమే మేము చేశాం’ అని చెప్పాలి” అని అన్నారు.
పదిమంది కుష్ఠురోగులను శుద్ధులుగా చేసిన యేసు
11యేసు సమరయ మరియు గలిలయ ప్రాంతాల సరిహద్దుల గుండా యెరూషలేముకు వెళ్లారు. 12ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించేటప్పుడు పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరంగా నిలబడి, 13“యేసూ, బోధకుడా, మమ్మును కనికరించండి!” అంటూ బిగ్గరగా కేక వేశారు.
14ఆయన వారిని చూసి, వారితో, “మీరు వెళ్లి, మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి” అన్నారు. వారు వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు.
15అందులో ఒకడు, తనకు స్వస్థత కలిగిందని చూసుకొని, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చాడు. 16అతడు యేసు పాదాల ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయుడు.
17యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? 18ఈ సమరయుడు తప్ప దేవుని స్తుతించడానికి ఇంకా ఎవ్వరు తిరిగి రాలేదా?” అని అడిగారు. 19ఆ తర్వాత వానితో, “నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు.
రాబోయే దేవుని రాజ్యం
20ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని యేసును అడిగినప్పుడు ఆయన, “దేవుని రాజ్యం పైకి కనిపించేదిగా రాదు, 21దేవుని రాజ్యం మీలోనే ఉంది గనుక ‘ఇదిగో ఇక్కడ ఉంది’ లేక ‘అదిగో అక్కడ ఉంది’ అని ఎవరు చెప్పలేరు” అని జవాబిచ్చారు.
22ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనుష్యకుమారుని దినాల్లోని ఒక రోజునైనా చూడాలని మీరు ఆశించే సమయం వస్తుంది, గాని మీరు ఆ రోజును చూడరు. 23ప్రజలు మీతో ‘అదిగో ఆయన అక్కడ ఉన్నాడు!’ లేక ‘ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు!’ అని అంటారు. మీరు వారి వెనుక పరుగెత్తకండి. 24ఎందుకంటే మనుష్యకుమారుని రాకడ దినము ఆకాశంలో ఒక దిక్కు నుండి మరో దిక్కువరకు మెరిసే మెరుపువలె ఉంటుంది. 25కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి మరియు ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి.
26“నోవహు దినాల్లో జరిగినట్టు, మనుష్యకుమారుని దినాల్లో కూడా జరుగుతుంది. 27నోవహు ఓడలోనికి ప్రవేశించిన రోజు వరకు ప్రజలందరూ తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసింది.
28“లోతు దినాల్లో కూడా అలాగే జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, కొంటూ, అమ్ముతూ, మొక్కలను నాటుతు, ఇండ్లు కట్టుకొంటున్నారు. 29కానీ లోతు సొదొమ గ్రామం విడిచి వెళ్లిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి వారందరు నాశనం అయ్యారు.
30“మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది. 31ఆ రోజు ఇంటిపైన ఉన్న వారెవరు ఇంట్లో నుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనక్కి వెళ్లకూడదు. 32లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు. 34ఆ రాత్రి ఒకే పరుపు మీద ఉన్న ఇద్దరిలో, ఒకరు తీసుకుపోబడతారు ఇంకొకరు విడవబడతారు. 35ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలి విసురుతుంటారు; ఒక స్త్రీ తీసుకుపోబడుతుంది, ఇంకొక స్త్రీ విడవబడుతుంది. [36ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు; ఒకడు కొనిపోబడతాడు మరొకడు విడవబడుతాడు” అని చెప్పారు.]#17:36 కొన్ని వ్రాతప్రతులలో ఈ వాక్యములు ఇక్కడ చేర్చబడలేదు
37అందుకు శిష్యులు, “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని యేసును అడిగారు.
అందుకు యేసు, “పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి” అని వారికి జవాబిచ్చారు.

Currently Selected:

లూకా 17: TCV

Tya elembo

Kabola

Copy

None

Olingi kobomba makomi na yo wapi otye elembo na baapareyi na yo nyonso? Kota to mpe Komisa nkombo