Logo ya YouVersion
Elilingi ya Boluki

యోహాను 3

3
నీకొదేముకు బోధించిన యేసు
1యూదుల న్యాయసభ సభ్యుడైన, నీకొదేము అనేవాడు పరిసయ్యులలో ఉన్నాడు. 2అతడు రాత్రి వేళ యేసు దగ్గరకు వచ్చి, “రబ్బీ, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. ఎందుకంటే దేవుడు తోడు లేకపోతే నీవు చేసే అద్బుత క్రియలను ఎవరు చేయలేరు” అన్నాడు.
3అందుకు యేసు, “తిరిగి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.
4అప్పుడు నీకొదేము, “ఒకడు పెరిగి పెద్దవాడైన తర్వాత తిరిగి ఎలా జన్మించగలడు? అతడు రెండవ సారి తన తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మించలేడు కదా!” అన్నాడు.
5అందుకు యేసు, “ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని, దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 6శరీరం నుండి జన్మించేది శరీరం, ఆత్మ నుండి జన్మించేది ఆత్మ. 7నీవు తిరిగి జన్మించాలని నేను చెప్పినందుకు నీవు ఆశ్చర్యపడవద్దు. 8గాలి తనకు ఇష్టమైన చోట వీస్తుంది, దాని శబ్దం వినగలవు కానీ అది ఎక్కడ నుండి వస్తుందో లేదా ఎక్కడికి వెళ్తుందో చెప్పలేవు. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అంతే” అన్నారు.
9దానికి నీకొదేము, “అది ఎలా సాధ్యం?” అని అడిగాడు.
10అందుకు యేసు “నీవు ఇశ్రాయేలీయుల బోధకుడివి, అయినా ఈ విషయాలను నీవు గ్రహించలేదా?” 11మాకు తెలిసిన వాటిని గురించి మేము మాట్లాడుతున్నాం, మేము చూసినవాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. అయినా మీరు మా సాక్ష్యాన్ని అంగీకరించడం లేదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 12నేను భూలోక విషయాలను చెప్పినప్పుడే, మీరు నమ్మడం లేదు మరి పరలోక విషయాలను చెప్పితే ఎలా నమ్ముతారు? 13పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప మరి ఎవ్వరు పరలోకానికి వెళ్లలేదు. 14-15ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందునట్లు, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విధంగా, మనుష్యకుమారుడు ఎత్తబడాలి.
16దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కనుక తన యందు విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుడిని అనుగ్రహించారు. 17దేవుడు తన కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చుటకు పంపలేదు కానీ, ఆయన ద్వారా లోకాన్ని రక్షించడానికే పంపారు. 18ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు, కాని నమ్మనివాడు శిక్షకు పాత్రుడని తీర్చబడ్డాడు, ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుని పేరు నందు నమ్మకముంచలేదు. 19ఆ తీర్పు ఏమనగా: లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ ప్రజలు తమ దుష్ట కార్యాలను బట్టి వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించారు. 20చెడ్డపనులు చేసే ప్రతి ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు, వారు తమ చెడుపనులు బయటపడతాయనే భయంతో వెలుగులోనికి రారు. 21“అయితే సత్యాన్ని అనుసరించి జీవించేవారు తాము చేసినవి దేవుని దృష్టి యెదుట చేసినవి గనుక అవి స్పష్టంగా కనబడేలా వెలుగులోనికి వస్తారు” అని చెప్పారు.
యేసు గురించి మరొకసారి సాక్ష్యమిచ్చిన యోహాను
22దాని తర్వాత, యేసు తన శిష్యులతో కలిసి యూదయ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వారితో కొంత కాలం గడిపి, బాప్తిస్మమిచ్చారు. 23సలీము దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో యోహాను కూడ బాప్తిస్మం ఇస్తున్నాడు, నీరు సమృద్ధిగా ఉండేది కనుక ప్రజలు వచ్చి బాప్తిస్మాన్ని పొందుకొనేవారు. 24ఇదంతా యోహాను చెరసాలలో వేయబడక ముందు. 25ఒక దినము శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులలో కొందరికి ఒక యూదునితో వివాదం ఏర్పడింది. 26వారు యోహాను దగ్గరకు వచ్చి అతనితో, “రబ్బీ, యోర్దాను నదికి అవతల నీతో పాటు ఉన్న వాడు, నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చావో, అతడు కూడా బాప్తిస్మమిస్తున్నాడు మరియు అందరు అతని దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.
27అందుకు యోహాను ఈ విధంగా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వారికి ఇవ్వబడితేనే గాని ఏ వ్యక్తి పొందుకోలేడు. 28‘నేను క్రీస్తును కాను, నేను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను’ అని నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు. 29పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకొనే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు, పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది. 30ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”
31పైనుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూలోకానికి చెందిన వాడు, భూలోక సంబంధిగానే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు. 32ఆయన తాను చూసినవాటిని, వినిన వాటిని గురించి సాక్ష్యం ఇస్తారు, కానీ ఎవరు ఆయన సాక్ష్యాన్ని అంగీకరించరు. 33ఎవరైతే దీనిని అంగీకరిస్తారో వారు దేవుడు సత్యవంతుడని ధ్రువీకరిస్తారు. 34ఎందుకంటే దేవుడు పరిమితి లేకుండా ఆత్మను అనుగ్రహిస్తారు. కనుక దేవుడు పంపినవాడు దేవుని మాటలనే మాట్లాడతాడు. 35తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక సమస్తం ఆయన చేతులకు అప్పగించారు. 36కుమారుని యందు నమ్మకముంచువారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కనుక వాడు జీవాన్ని చూడడు.

Currently Selected:

యోహాను 3: TCV

Tya elembo

Kabola

Copy

None

Olingi kobomba makomi na yo wapi otye elembo na baapareyi na yo nyonso? Kota to mpe Komisa nkombo