మత్తయి సువార్త 3

3
బాప్తిస్మమిచ్చే యోహాను మార్గాన్ని సిద్ధపరచుట
1ఆ రోజుల్లో బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి యూదయలోని అరణ్యంలో, 2“పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటిస్తున్నాడు. 3దేవుడు యెషయా ప్రవక్త ద్వారా:
“ ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి,
ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’
అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం”#3:3 యెషయా 40:3
అని ఇతని గురించే చెప్పింది.
4యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను, నడుముకు తోలుదట్టీ ధరించేవాడు. అతడు మిడతలు, అడవి తేనె తినేవాడు. 5యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి, 6తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు.
7అయితే తాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి పరిసయ్యులు సద్దూకయ్యులలో చాలామంది రావడం చూసి అతడు వారితో, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. 9‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడని మీతో చెప్తున్నాను. 10ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
11“పశ్చాత్తాపం కోసం నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. 12గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కళ్లాన్ని శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు” అని అన్నాడు.
యేసు బాప్తిస్మం
13అప్పుడు యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి గలిలయ నుండి యొర్దానుకు వచ్చారు. 14కాని యోహాను ఆయనతో, “నేనే నీ ద్వారా బాప్తిస్మం పొందాలి, అలాంటిది నీవు నా దగ్గరకు వస్తున్నావా?” అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు.
15అందుకు యేసు, “ఇప్పటికి ఇలా కానివ్వు. నీతి అంతటిని నెరవేర్చడానికి ఇలా చేయడం మనకు సరియైనది” అని చెప్పారు. కాబట్టి యోహాను ఒప్పుకున్నాడు.
16యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూశాడు. 17పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినపడింది: “ఈయన నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요