హబక్కూకు 1

1
1ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము.
హబక్కూకు ఫిర్యాదు
2యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా,
ఎంతకాలం వినకుండా ఉంటావు?
“హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా
ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?
3నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు?
తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు?
నాశనం హింస నా ముందే ఉన్నాయి;
కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.
4అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది,
ఎప్పుడూ న్యాయం జరగడం లేదు.
దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు,
న్యాయం చెడిపోతుంది.
యెహోవా జవాబు
5“దేశాల వైపు గమనించి చూసి,
నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి:
ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను,
దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా
మీరు దాన్ని నమ్మరు.
6తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి,
భూమి అంచుల వరకు తిరిగే
క్రూరులును, ఆవేశపరులునైన
బబులోను ప్రజలను#1:6 లేదా కల్దీయులను నేను రేపుతున్నాను.
7వారు అత్యంత భయంకరమైన ప్రజలు;
వారు తమకు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకుని
అధికారం చెలాయిస్తారు.
8వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి,
చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి.
వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి;
వారి రౌతులు దూరం నుండి వస్తారు.
ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు;
9వారంతా దౌర్జన్యం చేయడానికి వస్తారు.
ఎడారి గాలిలా వారి ముఖాలను పైకెత్తి
ఇసుకరేణువులంత విస్తారంగా ప్రజలను బందీలుగా పట్టుకుంటారు.
10వారు రాజులను వెక్కిరిస్తారు
పాలకులను ఎగతాళి చేస్తారు.
కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు;
మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు.
11గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు,
తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.”
హబక్కూకు రెండవ ఫిర్యాదు
12యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా?
నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు.
యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు;
నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.
13నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి;
నీవు తప్పును సహించలేవు.
మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు?
దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే
నీవెందుకు మౌనంగా ఉన్నావు?
14పాలకుడు లేని సముద్ర జీవులతో,
సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.
15చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి,
తన వలలో వారిని పట్టుకుంటాడు,
తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని
సంతోషంతో గంతులు వేస్తాడు.
16తన వల వలన విలాసవంతమైన జీవితం
మంచి ఆహారం దొరుకుతుందని
తన వలకు బలులు అర్పించి
తన ఉచ్చుకు ధూపం వేస్తాడు.
17అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ,
నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా?

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

హబక్కూకు 1: TSA

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in