మత్తయి 13

13
విత్తువాని యొక్క ఉపమానము
1అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నారు. 2గొప్ప జనసమూహాలు తన చుట్టూ గుమిగూడుతున్నారని యేసు ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు. 3అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. 4విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. 5మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి. 6కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేక ఎండిపోయాయి. 7మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ ముండ్ల పొదలు పెరిగి వాటిని అణిచివేసాయి. 8మరికొన్ని విత్తనాలు మంచినేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి. 9వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
10ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు ప్రజలతో ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు.
11అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు. 12కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగివుంటాడు. లేనివాని నుండి, వానికి కలిగివున్నది కూడా తీసివేయబడుతుంది. 13దీనిని బట్టి నేను వారితో ఉపమానరీతిలోనే చెప్పాను:
“వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు,
ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.
14యెషయా పలికిన ప్రవచనం వారి విషయంలో ఇలా నెరవేరింది:
“ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.
మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.
15ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి
వారు తమ చెవులతో కష్టంగా వింటారు,
తమ కళ్ళు మూసుకొని ఉన్నారు
లేకపోతే వారు తమ కళ్ళతో చూసి,
చెవులతో విని,
తమ హృదయాలతో గ్రహించి,
నా తట్టు తిరిగి ఉండేవారు అప్పుడు నేను వారిని స్వస్థపరిచే వాడిని.’#13:15 యెషయా 6:9,10
16అయితే మీ కళ్ళు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కనుక అవి ధన్యమైనవి. 17అనేకమంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
18“విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: 19పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విని దానిని గ్రహించలేకపోతే, దుర్మార్గుడు వచ్చి వారి హృదయాల్లో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. వారు దారి ప్రక్కన పడిన విత్తనాలు. 20రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంటే వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు. 21అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు. 22ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యాన్ని వింటారు కాని, జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనవ్యామోహం ఆ వాక్యాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి. 23కాని మంచినేలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యాన్ని విని గ్రహించినవారు, వారిలో కొందరు వందరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు ముప్పైరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.
కలుపుమొక్కల ఉపమానము
24ఆయన వారికి మరొక ఉపమానం చెప్పారు, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలను విత్తిన రైతును పోలి ఉంది. 25కాని అందరు నిద్రపోతున్నప్పుడు, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపుమొక్కల విత్తనాలు చల్లాడు. 26గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపుమొక్కలు కూడా కనిపించాయి.
27“ఆ పొలంలో పని చేసే దాసులు వచ్చి యజమానిని, ‘అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలను చల్లావు కదా! ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు.
28“ఆయన వారితో, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు.
“అందుకు ఆ దాసులు, ‘అయితే మమ్మల్ని వెళ్లి ఆ కలుపు మొక్కలను పీకెయ్యమంటారా?’ అని అడిగారు.
29“అందుకతడు ‘వద్దు, ఎందుకంటే కలుపు మొక్కలను పీకివేసేటప్పుడు వాటితో గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో. 30కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా కలుపు మొక్కలను పోగు చేసి వాటిని కాల్చివేయడానికి కట్టలుగా కట్టి ఆ తర్వాత గోధుమలను నా ధాన్యపు కొట్టులోనికి చేర్చండి అని కోత కోసే వారితో చెప్తాను అన్నాడు.’ ”
ఆవగింజ యొక్క ఉపమానము
31ఆయన వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, ఒకడు తన పొలంలో నాటిన ఆవగింజను పోలివుంది. 32అది విత్తనాలన్నింటిలో చిన్నదైనప్పటికి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటి కంటే పెద్దగా పెరిగి, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే ఒక చెట్టుగా ఎదుగుతుంది.”
33యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.”
34యేసు ఈ సంగతులను ఉపమానాలుగా జనసమూహానికి చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. 35ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి:
“నేను ఉపమానాలు చెప్పడానికే నా నోటిని తెరుస్తాను.
సృష్టికి పునాది వేయబడక ముందే రహస్యంగా ఉంచిన విషయాలను నేను చెపుతాను.”#13:35 కీర్తన 78:2
కలుపు మొక్కల ఉపమానము యొక్క వివరణ
36అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లారు. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పొలంలోని కలుపుమొక్కల ఉపమానాన్ని మాకు వివరించండి” అని అడిగారు.
37అందుకు యేసు వారితో, “మంచి విత్తనాలను చల్లేది మనుష్యకుమారుడు. 38పొలం అనేది ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపుమొక్కలు దుష్టునికి సంబంధించినవారు. 39ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం మరియు ఆ కోత కోసేవారు దేవదూతలు.
40“కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది. 41మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ మరియు దుష్ట కార్యాలను చేసే వారినందరినీ బయటకు తొలగిస్తారు. 42వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. 43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
దాచబడిన నిధి మరియు ముత్యాలను గురించిన ఉపమానము
44పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
45ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కొరకు వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. 46వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.
వలను గురించిన ఉపమానము
47ఇంకా, పరలోక రాజ్యం సముద్రంలోనికి వల విసిరి అన్ని రకాల చేపలు పట్టే ఆ వలను పోలి ఉంది. 48ఆ వల నిండిన తర్వాత జాలరులు దానిని ఒడ్డుకు లాగి వాటిలోని మంచి చేపలను బుట్టల్లో వేసుకొని పనికిమాలిన వాటిని అవతల పారవేస్తారు. 49ఈ యుగ సమాప్తంలో అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి చెడ్డవారిని వేరు చేస్తారు. 50ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
51యేసు వారిని, “మీరు వీటన్నిటిని గ్రహిస్తున్నారా?” అని అడిగినప్పుడు.
వారు “అవును, ప్రభువా” అన్నారు.
52యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన నిల్వగది నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు.
గౌరవింపబడని ఒక ప్రవక్త
53యేసు ఈ ఉపమానాలను చెప్పడం ముగించిన తర్వాత అక్కడి నుండి వెళ్లి, 54తన స్వగ్రామానికి చేరి, సమాజమందిరంలోని వారికి బోధించడం మొదలుపెట్టారు. వారు చాలా ఆశ్చర్యపడి, “ఈ అద్బుతాలు చేసే సామర్థ్యం, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? 55ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కారా? 56ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు.
57అయితే యేసు వారితో, “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు.
58వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్బుతాలు అక్కడ చేయలేదు.

ទើបបានជ្រើសរើសហើយ៖

మత్తయి 13: TCV

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល