అపొస్తలుల కార్యములు 25
25
1ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడుదినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను. 2అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. 3మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి–మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి. 4అందుకు ఫేస్తు–పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను 5గనుక మీలో సమర్థులైనవారు నాతోకూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను.
6అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. 7పౌలు వచ్చి నప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేక పోయిరి. 8అందుకు పౌలు –యూదుల ధర్మశాస్త్రమునుగూర్చి గాని దేవాలయమునుగూర్చి గాని, కైసరునుగూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. 9అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని–యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. 10అందుకు పౌలు–కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయ లేదని తమరికి బాగుగా తెలియును. 11నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను. 12అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదు వని ఉత్తరమిచ్చెను.
13కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి. 14వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా–ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు. 15నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. 16అందుకు నేను –నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. 17కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని. 18నేరము మోపినవారు నిలిచి నప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు. 19అయితే తమ మతమునుగూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను; 20ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని. 21అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచ వలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించువరకు నిలిపియుంచవ లెనని ఆజ్ఞాపించితిననెను. 22అందుకు అగ్రిప్ప–ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడు–రేపు వినవచ్చునని చెప్పెను.
23కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను. 24అప్పుడు ఫేస్తు–అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు–వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతో మనవి చేసికొనిరి. 25ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను. 26ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించియున్నాను. 27ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచు చున్నదని చెప్పెను.
Valið núna:
అపొస్తలుల కార్యములు 25: TELUBSI
Áherslumerki
Deildu
Afrita

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.