ఆదికాండము 5

5
ఆదాము కుటుంబ చరిత్ర
1ఆదాము#5:1 ఆదాము అక్షరాల “మానవత్వం లేక ప్రజలు” “భూమి లేక ఎర్రమన్ను” అన్న పదాలకు అర్థంలాంటిదే. వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదామును) చేశాడు. 2ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేశాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.
3ఆదాముకు 130 సంవత్సరముల వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు. 4షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బ్రతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 5కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
6షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు. 7ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 8కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
9తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు. 10కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 11కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
12కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు. 13మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 14కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
15మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అనే కుమారుడు అతనికి పుట్టాడు. 16యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 17కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
18యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు. 19హనోకు పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 20కనుక యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
21హనోకుకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు. 22మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 23కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. 24హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.
25మెతూషెలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు. 26లెమెకు పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 27కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు.
28లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. 29లెమెకు తన కుమారునికి నోవహు#5:29 నోవహు అనగా “నెమ్మది.” అని పేరు పెట్టాడు. “దేవుడు భూమిని శపించాడు గనుక వ్యయసాయదారులమైన మనం చాలా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు మనకు నెమ్మది కలుగజేస్తాడు” అన్నాడు లెమెకు.
30నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 31కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
32నోవహుకు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు.

Kiemelés

Megosztás

Másolás

None

Szeretnéd, hogy a kiemeléseid minden eszközödön megjelenjenek? Regisztrálj vagy jelentkezz be