మత్తయి 2

2
క్రీస్తును దర్శించిన జ్ఞానులు
1హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు, తూర్పు దిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. 2వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము” అని చెప్పారు.
3హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడు కలతచెందాడు, అతనితో పాటు యెరూషలేమంతా కలతచెందింది. 4హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉండింది అని వారిని అడిగాడు. 5అందుకు వారు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని చెప్పారు, “ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది:
6“ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా,
నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు;
ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి
నీలో నుండి వస్తాడు.’#2:6 మీకా 5:2,4
7అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకొన్నాడు. 8ఆయన వారితో, “మీరు వెళ్లి ఆ శిశువు కొరకు జాగ్రత్తగా వెదకండి. మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు.
9వారు రాజు మాటలు విని, బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి నిలిచే వరకు వారి ముందు వెళ్తూ వుండింది. 10వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు చాలా ఆనందించారు. 11వారు ఆ ఇంట్లోకి వెళ్లి, ఆ శిశువు తన తల్లియైన మరియతో ఉండడం చూసి, వారు వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ ధనాగారాలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళంను అర్పించారు. 12వారు వెళ్లిపోవలసిన సమయంలో హేరోదు రాజు దగ్గరకు వెళ్లకూడదని కలలో హెచ్చరిక రావడంతో వారు మరో దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.
ఐగుప్తుకు పారిపోవుట
13వారు వెళ్లిన తర్వాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “ఈ శిశువును చంపాలని హేరోదు రాజు వెదుకుతున్నాడు కనుక నీవు శిశువును అతని తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు” అని చెప్పాడు.
14కనుక యోసేపు లేచి, ఆ రాత్రి సమయంలోనే శిశువును అతని తల్లి మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్లాడు. 15హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. “ఐగుప్తులో నుండి నేను నా కుమారుని పిలిచాను”#2:15 హోషేయ 11:1 అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు నెరవేరాయి.
16ఆ జ్ఞానులచే మోసపోయానని గ్రహించిన హేరోదు చాలా కోపంతో, జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయస్సుగల మగ పిల్లలందరిని చంపుమని ఆదేశించాడు. 17యిర్మీయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాటలు నెరవేరాయి:
18“రామాలో ఏడ్పు, గొప్ప శోకం యొక్క,
ఒక ధ్వని వినబడింది,
రాహేలు తన సంతానం కొరకు ఏడుస్తూ
ఇక వారు లేరని,
ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”#2:18 యిర్మీయా 31:15
నజరేతునకు తిరిగి వచ్చుట
19హేరోదు చనిపోయిన తర్వాత, ఐగుప్తులో ఉన్న యోసేపుకు ప్రభువు దూత కలలో కనబడి 20అతనితో, “బాలుని ప్రాణం తీయాలని చూసినవారు చనిపోయారు, కాబట్టి నీవు లేచి, బాలున్ని, అతని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు” అని చెప్పాడు.
21కనుక యోసేపు లేచి, బాలున్ని, అతని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్లాడు. 22అయితే యూదయ ప్రాంతాన్ని అర్కెలా తన తండ్రియైన హేరోదు స్థానంలో పాలిస్తున్నాడని అతడు విని, అక్కడికి వెళ్లడానికి భయపడ్డాడు. కలలో దేవుని హెచ్చరిక పొంది, గలిలయ ప్రాంతానికి వెళ్లి, 23నజరేతు అనే ఊరిలో నివసించాడు. ఆయన నజరేయుడు అని పిలువబడుతాడు అని ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.

Chwazi Kounye ya:

మత్తయి 2: TCV

Pati Souliye

Pataje

Kopye

None

Ou vle gen souliye ou yo sere sou tout aparèy ou yo? Enskri oswa konekte