యోహాను సువార్త 5

5
కోనేటి దగ్గర స్వస్థత
1కొంతకాలం తర్వాత యూదుల పండుగకు యేసు యెరూషలేముకు వెళ్లారు. 2యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ అయిదు మండపాలు ఉన్నాయి. 3ఇక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం కలవారు, అనేక రకాల రోగాలు కలిగినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. 4ఎప్పటికప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవాడు. నీరు కదిలిన ప్రతిసారి ఆ కోనేటిలోనికి ఎవరు మొదట దిగితే వారికి ఏ రోగం ఉన్నా దాని నుండి బాగుపడేవారు. కాబట్టి అక్కడున్నవారు ఆ నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూసేవారు.#5:4 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు 5ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదల్లేని స్థితిలో ఉన్న ఒక రోగి అక్కడ ఉన్నాడు. 6చాలాకాలంగా అతడు అదే స్థితిలో అక్కడ పడి ఉన్నాడని తెలుసుకున్న యేసు, అతన్ని చూసి, “నీవు బాగవ్వాలని కోరుతున్నావా?” అని అడిగారు.
7ఆ కదల్లేనివాడు, “అయ్యా, నీరు కదిలినప్పుడు కోనేటిలోనికి దిగడానికి నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను దానిలోనికి దిగడానికి ప్రయత్నించేలోపు నాకన్నా ముందు మరొకరు దిగిపోతున్నారు” అని సమాధానం చెప్పాడు.
8అప్పుడు యేసు వానితో, “లేచి, నీ పరుపెత్తుకొని నడువు” అన్నారు. 9వెంటనే అతడు స్వస్థత పొంది, తన పరుపెత్తుకొని నడిచాడు.
ఇది సబ్బాతు దినాన జరిగింది. 10అందుకని యూదా నాయకులు స్వస్థత పొందినవానితో, “ఇది సబ్బాతు దినం కాబట్టి నీవు పరుపును మోయడానికి ధర్మశాస్త్రం అనుమతించదు” అన్నారు.
11అయితే అతడు, “నన్ను స్వస్థపరచినవాడు ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడని” అన్నాడు.
12కాబట్టి వారు అతన్ని, “నీకు పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు?” అని అడిగారు.
13అయితే స్వస్థపడినవానికి ఆయన ఎవరో తెలియలేదు. ఎందుకంటే యేసు అక్కడ ఉన్న గుంపులోనికి వెళ్లిపోయారు.
14తర్వాత యేసు వానిని దేవాలయంలో చూసి అతనితో, “చూడు, నీవు స్వస్థపడ్డావు. పాపం చేయకు లేదంటే నీకు మరింత కీడు జరుగవచ్చు” అని చెప్పారు. 15అతడు వెళ్లి యూదా నాయకులతో తనను బాగుచేసింది యేసు అని చెప్పాడు.
కుమారుని అధికారం
16యేసు ఈ కార్యాలను సబ్బాతు దినాన చేశాడని యూదా నాయకులు ఆయనను హింసించారు. 17యేసు వారికి సమాధానం ఇస్తూ, “నా తండ్రి నేటి వరకు కూడా తన పని చేస్తూనే ఉన్నారు. నేను కూడా చేస్తున్నాను” అని చెప్పారు. 18యేసు సబ్బాతు దినాన్ని పాటించకపోవడమే కాక దేవున్ని తన సొంత తండ్రి అని పిలుస్తూ, తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడని ఆయనను చంపడానికి వారు మరింత గట్టిగా ప్రయత్నించారు.
19కాబట్టి యేసు వారితో మాట్లాడుతూ, “నేను మీతో చెప్పేది నిజం, కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు; తండ్రి చేస్తున్న దానిని చూసి కుమారుడు చేస్తాడు, ఎందుకంటే తండ్రి ఏం చేస్తే కుమారుడు అదే చేస్తాడు. 20తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి తాను చేసే వాటన్నిటిని కుమారునికి చూపిస్తారు. అవును, మీరు ఆశ్చర్యపడేంతగా, వీటికన్నా గొప్ప కార్యాలను తండ్రి కుమారునికి చూపిస్తారు. 21తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తనకు ఇష్టమైనవారికి జీవాన్ని ఇస్తారు. 22అంతేకాక, తండ్రి ఎవరికి తీర్పు తీర్చరు కానీ, తండ్రిని ఘనపరచినట్లే అందరు కుమారున్ని కూడా ఘనపరచాలని, 23ఆయన అందరికి తీర్పు తీర్చే అధికారాన్ని కుమారునికే ఇచ్చారు. కుమారుని ఘనపరచని వారు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచరు.
24“నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మేవారు నిత్యజీవం కలవారు. వారు మరణం నుండి జీవంలోనికి దాటుతారు కాబట్టి వారికి తీర్పు ఉండదని నేను మీతో చెప్పేది నిజము. 25మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో చెప్పేది నిజము. 26తండ్రి తనలో జీవం కలిగి ఉన్న ప్రకారమే కుమారునిలో కూడా జీవం కలిగి ఉండేలా ఆయనకు అధికారం ఇచ్చారు. 27ఆయన మనుష్యకుమారుడు కాబట్టి తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇచ్చారు.
28“దీని గురించి ఆశ్చర్యపడకండి, ఎందుకనగా ఒక సమయం వస్తుంది, అప్పుడు సమాధుల్లో ఉన్నవారందరు ఆయన స్వరాన్ని విని, 29బయటకు వస్తారు. మంచి కార్యాలను చేసినవారు పునరుత్థాన జీవంలోనికి లేస్తారు. చెడు కార్యాలను చేసినవారు పునరుత్థాన శిక్ష పొందడానికి లేస్తారు. 30నా అంతట నేనే ఏమి చేయలేను. నేను విన్నదానిని బట్టి తీర్పు తీరుస్తాను, నా తీర్పు న్యాయమైనది. ఎందుకంటే నన్ను పంపినవాని ఇష్టాన్నే నేను చేస్తాను తప్ప నా ఇష్టాన్ని కాదు.
యేసును గురించి సాక్ష్యాలు
31“నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు. 32నా పక్షాన సాక్ష్యం ఇవ్వడానికి ఇంకొకరు ఉన్నారు. ఆయన నా గురించి ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
33“మీరు యోహాను దగ్గరకు కొందరిని పంపినప్పుడు, అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. 34నేను మనుష్యుల సాక్ష్యాన్ని కోరను కానీ, మీరు రక్షింపబడాలని దీనిని చెప్తున్నాను. 35యోహాను మండుచూ వెలుగిచ్చే దీపం వంటివాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు.
36“అయితే యోహాను చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. అదేమిటంటే పూర్తి చేయమని తండ్రి నాకిచ్చిన పనులు అనగా నేను చేస్తున్న పనులే తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. 37నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడు చూడలేదు. 38ఆయన పంపినవానిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్యం మీలో నివసించదు. 39మీరు వాటిని జాగ్రత్తగా పఠిస్తున్నారు ఎందుకంటే మీరు లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందని మీరనుకుంటున్నారు. ఈ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 40కాని జీవం పొందడానికి నా దగ్గరకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు.
41“నేను మనుష్యుల మెప్పును అంగీకరించను. 42అయితే నాకు మీ గురించి తెలుసు. మీ హృదయాల్లో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు. 43నేను నా తండ్రి పేరట వచ్చాను కాని, మీరు నన్ను అంగీకరించలేదు; అయితే మరొకడు తన సొంత పేరులో వస్తే మీరు అతన్ని అంగీకరిస్తారు. 44ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు?
45“నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీరు నిరీక్షణ ఉంచిన మోషేనే మీమీద నేరం మోపుతాడు. 46మీరు మోషేను నమ్మితే నన్ను కూడా నమ్ముతారు, ఎందుకంటే అతడు వ్రాసింది నా గురించే. 47కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మకపోతే నేను చెప్పేది ఎలా నమ్ముతారు?”

वर्तमान में चयनित:

యోహాను సువార్త 5: TSA

हाइलाइट

शेयर

कॉपी

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in