ఆది 24
24
ఇస్సాకు రిబ్కాల కళ్యాణం
1అబ్రాహాము బాగా వయస్సు మళ్ళి వృద్దుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు. 2అప్పుడు అబ్రాహాము తన ఆస్తి వ్యవహారాలనూ ఇంటి విషయాలనూ నిర్వహించే పెద్ద దాసుడిని పిలిచాడు. “#24:2 ఇది ఆ కాలంలో శపథం చేసే పధ్ధతి. నీ చెయ్యి నా తొడ కింద ఉంచు. 3నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా 4నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడనుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో ‘భూమీ ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు’ అని ప్రమాణం చేయిస్తాను” అని అతనితో అన్నాడు.
5దానికి ఆ దాసుడు “ఒకవేళ ఆమె నాతో కలసి ఈ దేశం రావడానికి ఇష్టపడక పొతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా?” అని ప్రశ్నించాడు. 6అప్పుడు అబ్రాహాము “ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు. 7నా తండ్రి ఇంటి నుండీ, నా #24:7 నా జన్మ భూమి.బంధువుల దేశం నుండీ నన్ను తీసుకు వచ్చి ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు.
8అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడక పొతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు” అని చెప్పాడు. 9కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రాహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు.
10ఆ దాసుడు తన యజమానికి చెందిన పది ఒంటెలను తీసుకుని ప్రయాణమయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకు వెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్ళి #24:10 అంటే మెసపుటేమియా. ప్రస్తుత ఇరాక్ ప్రాంతం.ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు. 11అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్ళు తోడుకోడానికి వచ్చే సమయమది.
12అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు. “నా యజమాని అయిన అబ్రాహాము దేవుడివైన యెహోవా, నా యజమాని అయిన అబ్రాహాముపట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈ రోజు నాకు కార్యం సఫలం చెయ్యి. 13ఇదిగో చూడు, నేను ఈ నీళ్ళ బావి దగ్గర నిలబడ్డాను. ఈ ఊళ్ళో వాళ్ళ పిల్లలు నీళ్ళు తోడుకోవడం కోసం వస్తున్నారు. 14ఇది ఈ విధంగా జరగనియ్యి. ‘నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి’ అని నేను అంటే ‘తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను’ అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను” అన్నాడు.
15అతడు ఈ మాటలు ముగించక ముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రాహాము సోదరుడైన నాహోరుకూ అతని భార్య అయిన మిల్కాకూ పుట్టిన కుమారుడు. 16ఆ అమ్మాయి చాలా అందకత్తె, కన్య. పురుష స్పర్శ ఎరగనిది. ఆమె ఆ బావిలోకి దిగి కుండతో నీళ్ళు నింపుకుని పైకి వచ్చింది.
17అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. “దయచేసి నీ కుండలో నీళ్ళు తాగడానికి నాకు పోస్తావా?” అని ఆమెను అడిగాడు. 18దానికామె “అయ్యా, తాగండి” అంటూ చప్పున కుండ చేతిమీదికి దించుకుని అతడు తాగడానికి నీళ్ళు ఇచ్చింది.
19ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తరవాత “మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని చెప్పి 20త్వరగా అక్కడి తొట్టిలో కుండెడు నీళ్ళు కుమ్మరించి తిరిగి నీళ్ళు తోడటానికి బావి దగ్గరికి పరుగు తీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడి పోసింది.
21ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు 22ఒంటెలు నీళ్ళు తాగడం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కుపుడకను, ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు. 23ఆమెను “నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.
24దానికి ఆమె “నేను నాహోరుకూ మిల్కాకూ కొడుకైన బెతూయేలు కూతుర్ని” అంది. 25ఇంకా ఆమె “మా దగ్గర చాలా గడ్డీ, మేతా ఉన్నాయి. రాత్రి ఉండటానికి స్థలం కూడా ఉంది” అంది.
26ఆ వ్యక్తి తల వంచి యెహోవాను ఇలా ఆరాధించాడు. 27“అబ్రాహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాస్యతనూ, తన విశ్వసనీయతనూ చూపడం మానలేదు. నన్నయితే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు” అన్నాడు.
28అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. 29ఈ రిబ్కాకు ఒక సోదరుడున్నాడు. అతని పేరు లాబాను. అతడు తన సోదరి చేతులకున్న కడియాలూ ముక్కుకు ఉన్న పుడకనూ చూశాడు. అలాగే “ఆ వ్యక్తి నాతొ ఇలా చెప్పాడు” అంటూ తన సోదరి చెప్పిన మాటలూ విన్నాడు. 30అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడతను తన ఒంటెల పక్కనే నిలబడి ఉన్నాడు.
31అతణ్ణి చూసి లాబాను ఇలా అన్నాడు. “యెహోవా ఆశీర్వదించిన వాడా. లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటినీ, మీ ఒంటెలకు స్థలాన్నీ సిద్ధం చేశాను” అన్నాడు. 32ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డీ మేతా పెట్టాడు. అబ్రాహాము సేవకునికీ అతనితో కూడా వచ్చిన వారికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు.
33భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు. కానీ అతడు “నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది. అది చెప్పే వరకూ నేను భోజనం చేయను” అన్నాడు. అందుకు “చెప్పండి” అన్నాడు. 34అప్పుడు అతడు ఇలా చెప్పాడు. “నేను అబ్రాహాము దాసుణ్ణి. 35యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెలనూ, పశువులనూ, వెండీ బంగారాలనూ, దాసులనీ, దాసీలనూ అనుగ్రహించాడు.
36నా యజమాని భార్య శారా. ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది. నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుక్కే ఇచ్చాడు. 37నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ కనాను దేశపు అమ్మాయిల్లో ఎవర్నీ నా కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయవద్దు. 38నువ్వు నా తండ్రి ఇంటికీ, నా రక్త సంబధికుల దగ్గరకూ వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకు రావాలి’ అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు.
39దానికి నేను ‘ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే?’ అని నా యజమానిని అడిగాను. 40అతడు ‘నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు. 41అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు’ అన్నాడు.
42నేను ఈ రోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను. ‘నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, నా ఈ ప్రయాణాన్ని విజయవంతం చేస్తే 43నేను ఈ నీళ్ళ బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్ళు తోడుకోడానికి వచ్చిన అమ్మాయితో నేను, “దయచేసి నీ కుండలో నీళ్ళు కాసిన్ని నాకు తాగడానికి ఇవ్వు” అని అడిగితే 44“మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను.’
45నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో రిబ్కా తన భుజం మీద కుండ పెట్టుకుని బావి దగ్గరికి వచ్చి ఆ బావి లోకి దిగి నీళ్ళు తోడుకుని వచ్చింది. అప్పుడు నేను నాకు తాగడానికి నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను. 46ఆమె వెంటనే కుండ దించి ‘తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను’ అంది. నేను ఆ నీళ్ళు తాగాను. ఆమె ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టింది.
47అప్పుడు నేను ‘నువ్వు ఎవరి అమ్మాయివి?’ అని అడిగాను. ఆమె ‘నేను మిల్కా నాహోరుల కొడుకు బెతూయేలు కూతురుని’ అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పుడకా చేతులకు కడియాలూ పెట్టాను. 48నా యజమాని బంధువు కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకు వెళ్ళడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యెహోవాను నా తలవంచి ఆరాధించాను. నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించాను.
49కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయనూ నమ్మకాన్నీ చూపించ దల్చుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేనెటు వెళ్ళాలో అటు వెళ్తాను” అన్నాడు.
50అప్పుడు లాబానూ, బెతూయేలూ ఇలా జవాబిచ్చారు. “ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో, చెడో మేమేమి చెప్పగలం? 51చూడు, రిబ్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది. ఆమెను తీసుకు వెళ్ళు. యెహోవా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది గాక!”
52అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. 53తరువాత ఆ సేవకుడు వెండీ బంగారు నగలనూ, వస్త్రాలనూ బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికీ, సోదరుడికీ విలువైన కానుకలిచ్చాడు.
54అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు “నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అని అడిగాడు. 55ఆమె సోదరుడూ, ఆమె తల్లీ “మా అమ్మాయిని కనీసం పది రోజులన్నా మా దగ్గర ఉండనీయి. తరువాత ఆమెను తీసుకు వెళ్ళవచ్చు” అన్నారు.
56కానీ అతడు “యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేసాడు. కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు. నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అన్నాడు. 57అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం 58అని రిబ్కాను పిలిచారు. “ఈ వ్యక్తి తో నువ్వు వెళ్తావా?” అని అడిగారు. దానికామె “వెళ్తాను” అంది.
59కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసీని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడూ, అతనితో వచ్చిన మనుషులతో పంపించారు.
60అప్పుడు వాళ్ళు రిబ్కాతో “మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి.
నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!” అంటూ ఆమెను దీవించారు.
61రిబ్కా, ఆమె సేవకురాళ్ళూ ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు.
62ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు.
63ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. 64రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది. 65“మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?” అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు “ఆయన నా యజమాని” అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది.
66అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు. 67అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.
वर्तमान में चयनित:
ఆది 24: IRVTel
हाइलाइट
शेयर
कॉपी
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.