ఆదికాండము 21

21
1యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను. 2ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. 3అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. 4మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. 5అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు. 6అప్పుడు శారా
–దేవుడు నాకు నవ్వు కలుగజేసెను.
వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.
7మరియు
శారా పిల్లలకు స్తన్యమిచ్చునని
యెవరు అబ్రాహాముతో చెప్పును
నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.
8ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. 9అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి 10–ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. 11అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. 12అయితే దేవుడు–ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును. 13అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. 14కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజముమీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. 15ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి 16యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. 17దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; 18నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. 19మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. 20దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్ద వాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. 21అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
22ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి–నీవుచేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక 23నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. 24అందుకు అబ్రాహాము–ప్రమాణము చేసెదననెను. 25-26అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు–ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడేగాని యీ సంగతి విన లేదని చెప్పగా 27అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. 28తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక 29అబీమెలెకు అబ్రాహాముతో–నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు 30–నేనే యీ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱెపిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. 31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా#21:31 సాక్ష్యార్థెమైన బావి. అనబడెను. 32బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను. 33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. 34అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

वर्तमान में चयनित:

ఆదికాండము 21: TELUBSI

हाइलाइट

शेयर

कॉपी

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in