ఆది 8

8
1అయితే దేవుడు నోవహును, అతనితో ఓడలో ఉన్న సమస్త అడవి జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకుని, భూమి మీదికి గాలిని పంపినప్పుడు నీరు వెనుకకు తగ్గింది. 2అగాధజలాల ఊటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి, ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఆగిపోయింది. 3భూమి నుండి క్రమంగా నీరు తగ్గింది, నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గి, 4ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది. 5పదవనెల వరకు నీరు తగ్గుతూ ఉంది, పదవనెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి.
6నలభైౖ రోజుల తర్వాత నోవహు తాను తయారుచేసిన ఓడ కిటికీ తెరిచి, 7ఒక కాకిని బయటకు పంపాడు, అది భూమిపై నీళ్లు ఆరిపోయే వరకు ఇటు అటు ఎగురుతూ ఉంది. 8అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో చూడటానికి నోవహు ఒక పావురాన్ని బయటకు పంపాడు. 9అయితే భూమి మీద అంతటా నీరు ఉన్నందుకు ఆ పావురానికి వాలడానికి చోటు దొరకలేదు; కాబట్టి అది ఓడలో ఉన్న నోవహు దగ్గరకు తిరిగి వచ్చింది. అతడు చేయి చాపి, పావురాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. 10మరో ఏడు రోజులు వేచియున్న తర్వాత అతడు ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు. 11సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు. 12మరో ఏడు రోజులు ఆగి, ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు, అయితే ఈసారి అది అతని దగ్గరకు తిరిగి రాలేదు.
13నోవహు యొక్క 601 వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన భూమి మీద నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు నోవహు ఓడ కప్పు తెరిచి చూస్తే నేల ఆరిపోయి కనిపించింది. 14రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది.
15అప్పుడు దేవుడు నోవహుతో, 16“నీవూ, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, ఓడలో నుండి బయటకు రండి. 17నీతో ఉన్న ప్రతి జీవిని అంటే పక్షులు, జంతువులు, నేల మీద ప్రాకే ప్రాణులన్నిటిని బయటకు తీసుకురా, అప్పుడు అవి భూమి మీద ఫలించి, వృద్ధి చెంది, విస్తరిస్తాయి” అని అన్నారు.
18నోవహు, తన భార్య, కుమారులు, కుమారుల భార్యలతో పాటు బయటకు వచ్చాడు. 19జంతువులు, నేల మీద ప్రాకే జీవులు, పక్షులు, భూమి మీద తిరిగే జీవులన్నీ ఒక జాతి వెంబడి మరో జాతి, వాటి వాటి జంటల ప్రకారం ఓడలో నుండి బయటకు వచ్చాయి.
20అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు. 21యెహోవా ఆ బలి అర్పణ యొక్క ఇష్టమైన సువాసన పీల్చుకుని తన హృదయంలో ఇలా అనుకున్నారు: “మనుష్యుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అయినప్పటికీ, ఇక ఎన్నడు మనుష్యుల కారణంగా భూమిని శపించను. నేను ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు సమస్త జీవులను నాశనం చేయను.
22“ఈ భూమి ఉన్నంత కాలం,
నాటే కాలం కోతకాలం,
చలి వేడి,
ఎండకాలం చలికాలం,
పగలు రాత్రి,
ఎప్పుడూ నిలిచిపోవు.”

נבחרו כעת:

ఆది 8: TSA

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו