Logo YouVersion
Îcone de recherche

మత్తయి సువార్త 1

1
యేసు క్రీస్తు వంశావళి
1ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు#1:1 క్రీస్తు లేదా మెస్సీయా అంటే అభిషిక్తుడు యేసు వంశావళి:
2అబ్రాహాము కుమారుడు ఇస్సాకు,
ఇస్సాకు కుమారుడు యాకోబు,
యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు.
3యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు.
పెరెసు కుమారుడు హెస్రోను,
హెస్రోను కుమారుడు అరాము.#1:3 ప్రా.ప్ర.లలో రాము అలాగే; 1 దిన 2:9-10
4అరాము కుమారుడు అమ్మీనాదాబు,
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను,
నయస్సోను కుమారుడు శల్మాను.
5శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు,
బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు,
ఓబేదు కుమారుడు యెష్షయి.
6రాజైన దావీదు యెష్షయి కుమారుడు.
దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.
7సొలొమోను కుమారుడు రెహబాము,
రెహబాము కుమారుడు అబీయా,
అబీయా కుమారుడు ఆసా.
8ఆసా కుమారుడు యెహోషాపాతు,
యెహోషాపాతు కుమారుడు యెహోరాము,
యెహోరాము కుమారుడు ఉజ్జియా.
9ఉజ్జియా కుమారుడు యోతాము,
యోతాము కుమారుడు ఆహాజు,
ఆహాజు కుమారుడు హిజ్కియా.
10హిజ్కియా కుమారుడు మనష్షే,
మనష్షే కుమారుడు ఆమోను,
ఆమోను కుమారుడు యోషీయా.
11యోషీయా కుమారులెవరనగా యెకొన్యా#1:11 అంటే యెహోయాకీను; 12వచనంలో కూడా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.
12బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే:
యెకొన్యా కుమారుడు షయల్తీయేలు,
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
13జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు,
అబీహూదు కుమారుడు ఎల్యాకీము,
ఎల్యాకీము కుమారుడు అజోరు.
14అజోరు కుమారుడు సాదోకు,
సాదోకు కుమారుడు ఆకీము,
ఆకీము కుమారుడు ఎలీహూదు.
15ఎలీహూదు కుమారుడు ఎలియాజరు,
ఎలియాజరు కుమారుడు మత్తాను,
మత్తాను కుమారుడు యాకోబు.
16యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.
17ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.
యోసేపు యేసును తన కుమారునిగా అంగీకరించుట
18యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. 19అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
20అతడు ఇలా ఆలోచిస్తూ ఉండగా, కలలో ప్రభువు దూత అతనికి కనపడి, “దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది. 21ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు#1:21 యెహోషువా అనే పదానికి గ్రీకు భాషలో యేసు అని పేరు పెట్టాలి” అని చెప్పాడు.
22ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది. 23“ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు#1:23 యెషయా 7:14 అని పేరు పెడతారు” (అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం).
24యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. 25అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi

Vidéos pour మత్తయి సువార్త 1