మత్తయి 8

8
యేసు కుష్ఠు వ్యాధిగల వానిని స్వస్థపరచుట
1యేసు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. 2కుష్ఠురోగంతో ఉన్న ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అన్నాడు.
3యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు అవు!” అన్నారు. వెంటనే వాడు తన కుష్ఠురోగం నుండి శుద్ధుడయ్యాడు. 4అప్పుడు యేసు వానితో, “నీవు ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని, వారికి సాక్ష్యంగా ఉండేలా, మోషే నియమించిన కానుకను అర్పించు” అని వానికి చెప్పారు.
శతాధిపతి యొక్క విశ్వాసం
5యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, 6“ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని సహాయాన్ని కోరాడు.
7యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని స్వస్థపరచనా?” అన్నాడు.
8అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. 9ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే, నా క్రింద సైనికులున్నారు. ఒకడిని ‘వెళ్లు’ అంటే వెళ్తాడు, ‘రా’ అంటే వస్తాడు. నా దాసుని ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
10యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి తనను వెంబడిస్తున్న వారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో నిజంగా చెప్తున్నాను. 11అనేకులు తూర్పు, పడమర నుండి వచ్చి, పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 12కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోనికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
13అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు! నీవు నమ్మినట్లే నీకు జరుగును” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు స్వస్థపడ్డాడు.
యేసు అనేకులను స్వస్థపరచుట
14తర్వాత యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు, పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూసారు. 15ఆయన ఆమె చెయ్యిని ముట్టగానే జ్వరం ఆమెను వదలిపోయింది, ఆమె లేచి ఆయనకు పరిచారం చేయడం మొదలు పెట్టింది.
16సాయంకాలమైనప్పుడు, దయ్యాలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన ఒక్కమాటతో ఆ దయ్యాలను వెళ్లగొట్టి, రోగులందరిని స్వస్థపరిచారు. 17యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన ఈ మాటలు నెరవేరేలా ఇలా జరిగింది:
“ఆయన మన బలహీనతలను తీసుకొని,
మన వ్యాధులను భరించారు.”#8:17 యెషయా 53:4
యేసును వెంబడించుట
18యేసు తన చుట్టు ఉన్న జనసమూహాన్ని చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దాం అని ఆదేశించారు. 19అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, “బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అన్నాడు.
20అందుకు యేసు, “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు.
21ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతి పెట్టడానికి నన్ను వెళ్లనివ్వు” అని అన్నాడు.
22అయితే యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకొంటారు నీవైతే నన్ను వెంబడించు” అన్నారు.
యేసు తుఫానును నిమ్మళింపజేయుట
23ఆ తర్వాత యేసు పడవ ఎక్కారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. 24అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాను తీవ్రంగా చెలరేగి అలలు ఆ పడవ మీద పడ్డాయి. అయితే యేసు నిద్రపోతున్నారు. 25శిష్యులు వెళ్లి, “ప్రభువా, మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని కాపాడు” అంటూ ఆయనను లేపారు.
26అందుకు ఆయన “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలులను, అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.
27వారందరు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.
దయ్యాలు పట్టిన ఇద్దరు పురుషులను స్వస్థపరచుట
28ఆయన గలిలయ అవతలి ఒడ్డున ఉన్న గదరేనీ ప్రాంతం చేరుకొన్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురయ్యారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడంతో ఆ దారిన ఎవరు వెళ్లలేక పోతున్నారు. 29అవి ఆయనను చూసిన వెంటనే, “దేవుని కుమారుడా! మాతో నీకేమి? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశాయి.
30వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. 31ఆ దయ్యాలు, “ఒకవేళ నీవు మమ్మల్ని బయటకు వెళ్లగొడితే, ఆ పందుల మందలోనికి మమ్మల్ని పంపు” అని యేసును బ్రతిమలాడాయి.
32ఆయన వాటితో, “వెళ్లండి!” అన్నారు కనుక అవి బయటకు వచ్చి ఆ పందులలోనికి చొరబడ్డాయి, అప్పుడు ఆ పందుల మంద మొత్తం ఎత్తైన ప్రదేశం నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి ఆ నీటిలో పడి చచ్చాయి. 33ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి, పట్టణంలోనికి జరిగినదంతా అనగా దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని తెలియజేసారు. 34అప్పుడు ఆ పట్టణమంతా యేసును కలవడానికి వెళ్లి ఆయనను చూసి, తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ఆయనను బ్రతిమలాడారు.

Tällä hetkellä valittuna:

మత్తయి 8: TCV

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään