ఆది 16

16
హాగరు ఇష్మాయేలు
1అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు; 2కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది.
శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు. 3అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది. 4అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది.
తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది. 5అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.
6అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది.
7యెహోవా దూత హాగరు ఎడారిలో నీటిబుగ్గ దగ్గర ఉండడం చూశాడు; అది షూరు మార్గం ప్రక్కన ఉండే నీటిబుగ్గ. 8ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు.
ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది.
9అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరకు తిరిగివెళ్లి ఆమెకు లోబడి ఉండు” అని చెప్పాడు. 10యెహోవా దూత ఇంకా మాట్లాడుతూ, “నీ సంతానాన్ని లెక్కించలేనంత అధికం చేస్తాను” అని చెప్పాడు.
11యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు:
“ఇప్పుడు నీవు గర్భవతివి
నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు,
యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి
అతనికి ఇష్మాయేలు#16:11 ఇష్మాయేలు అంటే దేవుడు వింటాడు. అని నీవు పేరు పెడతావు.
12అతడు ఒక అడవి గాడిదలాంటి మనుష్యుడు;
అందరితో అతడు విరోధం పెట్టుకుంటాడు,
అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి,
అతడు తన సోదరులందరితో
శత్రుత్వం కలిగి జీవిస్తాడు.”
13ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది. 14అందుకే ఆ బావికి బెయేర్-లహాయి-రోయి#16:14 బెయేర్-లహాయి-రోయి అంటే నన్ను చూసే జీవంగల దేవుని బావి అని పేరు వచ్చింది; అది కాదేషు బెరెదు మధ్యలో ఇప్పటికి ఉంది.
15హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. 16హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.

Tällä hetkellä valittuna:

ఆది 16: TSA

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään