YouVersion Logo
Search Icon

లూకా 20

20
యేసుకు అధికారం ఎక్కడిది?
మత్తయి 21:23-27; మార్కు 11:27-33
1ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి, 2“నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు” అని ఆయనను అడిగారు.
3దానికి ఆయన, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి. 4యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల్లో నుండి కలిగిందా?” అని వారినడిగాడు. 5వారు ఇలా ఆలోచించారు, “మనం ‘పరలోకం నుండి కలిగింది’ అంటే, ‘అలాగైతే మీరెందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. 6‘మనుషుల్లో నుండి కలిగింది’ అంటే జనం మనలను రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు.” 7ఇలా ఆలోచించుకుని వారు, “అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు” అని జవాబిచ్చారు. 8దానికి యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను” అన్నాడు.
ద్రాక్షతోట ఉపమానం
మత్తయి 21:33-46; మార్కు 12:1-12; యెష 5:1-7
9ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తరువాత వేరే దేశానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉన్నాడు.
10 కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు. 11మళ్ళీ అతడు మరో పనివాణ్ణి పంపాడు. వారు వాణ్ణి కూడా కొట్టి, అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. 12మళ్ళీ అతడు మూడవ వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు.
13 అప్పుడా ద్రాక్షతోట యజమాని ఇలా అనుకున్నాడు, “ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో.” 14అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి, “ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 15వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు? 16అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు.” వారు అది విని, “అలా ఎన్నటికీ కాకూడదు” అన్నారు. 17ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి? 18ఈ రాయి పైన పడే ప్రతి వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది.”
పన్నుకట్టడం విషయమై ప్రశ్న
మత్తయి 22:15-22; మార్కు 12:13-17
19ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు. 20వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయనను గవర్నర్ వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయనను మాటల్లో తప్పు పట్టుకోవాలని, నీతిపరులుగా నటించే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు. 21వారు వచ్చి బోధకా, “నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు. మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు. 22మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా?” అని ఆయనను అడిగారు.
23ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి, 24“ఒక నాణెం చూపించండి. దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని అడిగాడు. వారు, “సీజరువి” అన్నారు. 25అందుకాయన, “ఆలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అన్నాడు. 26వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు.
పునరుత్థానం గురించి సద్దూకయ్యులకు యేసు ఇచ్చిన జవాబు
మత్తయి 22:23-33; మార్కు 12:18-27
27పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు.
28“బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా, 29ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు. 30రెండవవాడు, మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు. 31ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు. 32ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది? 33ఇక్కడ ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా” అన్నారు.
34అందుకు యేసు, “ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ, 35పరలోకంలో నిత్యజీవానికీ, మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు. 36వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు. 37మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా, 38ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ సజీవులే” అని వారికి జవాబిచ్చాడు.
యేసు శాస్త్రులను ప్రశ్నించడం
మార్కు 12:35-37
39-40ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు, “బోధకా, చాలా బాగా చెప్పావు” అన్నారు. 41ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు?
42-43 “నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ, నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.
44 దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?” అన్నాడు. 45ప్రజలందరూ వింటుండగా ఆయన, “శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు. 46వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు. 47వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.

Currently Selected:

లూకా 20: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in