YouVersion Logo
Search Icon

ఆది 20

20
అబ్రాహము, అబీమెలెకు
1అబ్రాహాము అక్కడ నుండి బయలుదేరి దక్షిణదేశానికి తరలి వెళ్ళాడు. అలా కాదేషుకూ, షూరుకూ మధ్య ఉన్న ప్రాంతంలో నివసించాడు. కొంతకాలం గెరారులో పరదేశిగా ఉన్నాడు. 2అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి “ఈమె నా చెల్లి” అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు. 3కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకు దగ్గరికికు కనబడి అతనితో “చూడు, నువ్వు చచ్చినట్టే! ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్తీ ఒక వ్యక్తికి భార్య” అని చెప్పాడు.
4అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు “ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా? 5‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను” అన్నాడు.
6అందుకు దేవుడు అతనికి కలలో కనబడి “అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించ లేదు. 7కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వూ, నీకు చెందినవారూ తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో” అని చెప్పాడు.
8తెల్లవారకముందే అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించాడు. వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వారంతా అది విని ఎంతో భయపడ్డారు. 9అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు “నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు” అన్నాడు. 10అబీమెలెకు అబ్రాహామును చూసి “నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?” అని అడిగాడు.
11అబ్రాహాము “ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను 12అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది. 13దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో ‘మనం వెళ్ళే ప్రతి స్థలం లోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే’ అని చెప్పాను” అన్నాడు. 14అబీమెలెకు గొర్రెలనూ ఎద్దులనూ దాసులనూ దాసీలనూ రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు.
15తరువాత అబీమెలెకు “చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో” అని అబ్రాహాముతో అన్నాడు. 16తరువాత అతడు శారాతో “చూడు, నీ అన్నకు నేను వెయ్యి వెండి నాణాలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్నవారందరి ఎదుట ఈడబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుటా నీకు న్యాయం జరిగింది” అన్నాడు. 17అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకునూ, అతని భార్యనూ అతని దాసీలనూ స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు. 18ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.

Currently Selected:

ఆది 20: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in