లూకా 14
14
1విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. 2అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను. 3-4యేసు–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి 5–మీలో ఎవని గాడిదయైనను#14:5 కొన్ని ప్రాచీన ప్రతులలో–ఎవని కుమారుడైనను అని పాఠాంతరము. ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడిగెను. 6ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
7పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. 8–నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా 9నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి –ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. 10అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి–స్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును. 11తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.
12మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను– నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును. 13అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. 14నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
15ఆయనతోకూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు విని–దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా 16ఆయన అతనితో నిట్లనెను–ఒక మనుష్యుడు గొప్ప విందుచేయించి అనేకులను పిలిచెను. 17విందుకాలమందు అతడు – ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను. 18అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు– నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను. 19మరియొకడు–నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. 20మరి యొకడు – నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. 21అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి–నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీను లను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను. 22అంతట దాసుడు–ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను. 23అందుకు యజమానుడు–నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము; 24ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.
25-26బహుజనసమూహములు ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి–ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. 28మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? 29చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున 30చూచువారందరు–ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. 31మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? 32శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా. 33ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. 34ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? 35అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.
Επιλέχθηκαν προς το παρόν:
లూకా 14: TELUBSI
Επισημάνσεις
Κοινοποίηση
Αντιγραφή
Θέλετε να αποθηκεύονται οι επισημάνσεις σας σε όλες τις συσκευές σας; Εγγραφείτε ή συνδεθείτε
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.