మార్కు సువార్త 11

11
రాజుగా యెరూషలేముకు వచ్చిన యేసు
1వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ, బేత్పగే గ్రామాలకు వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, 2“మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడకు తీసుకురండి. 3‘మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి, త్వరలో తిరిగి పంపిస్తారు’ అని చెప్పండి” అన్నారు.
4వారు వెళ్లి ఒక వీధిలో ఒక ఇంటి తలుపు బయట ఒక గాడిదపిల్ల కట్టబడి ఉండడం చూశారు వారు దాన్ని విప్పుతున్నప్పుడు, 5అక్కడ నిలబడ్డ కొందరు, “మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారిని అడిగారు. 6యేసు చెప్పినట్లే వారు ఆ మనుష్యులకు చెప్పినప్పుడు, ఆ మనుష్యులు దాన్ని తీసుకెళ్లనిచ్చారు. 7వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తీసుకువచ్చి దానిపై తమ వస్త్రాలను వేశారు, ఆయన దానిపై కూర్చున్నారు. 8చాలామంది ప్రజలు తమ వస్త్రాలను త్రోవలో పరిచారు, మరికొందరు పొలాల్లో నుండి కొమ్మలు నరికితెచ్చి పరిచారు. 9ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా,
“హోసన్నా!”
“ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”#11:9 కీర్తన 118:25-26
10“రానైయున్న మన పితరుడైన దావీదు రాజ్యం ధన్యమవును గాక!”
“సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!”
అని కేకలు వేశారు.
11యేసు యెరూషలేములో ప్రవేశించి, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లారు. అక్కడ ఉన్నవాటన్నిటిని చూశారు కాని అప్పటికే ఆలస్యం అయినందుకు ఆయన పన్నెండు మందితో కలిసి బేతనియ గ్రామానికి వెళ్లిపోయారు.
యేసు అంజూర చెట్టును శపించుట దేవాలయ ఆవరణాన్ని శుభ్రపరచుట
12మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. 13దూరం నుండి ఒక అంజూర చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇకపై ఎవ్వరూ ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక” అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు.
15వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు. 16దేవాలయ ఆవరణంలో ఎవరినీ వ్యాపారం చేయనివ్వలేదు. 17ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా?#11:17 యెషయా 56:7 కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ”#11:17 యిర్మీయా 7:11 అన్నారు.
18ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ మాటలు విని, ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడం ప్రారంభించారు, కాని ప్రజలందరు ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడడం చూసి, ఆయనకు భయపడ్డారు.
19సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు.
20మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూర చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. 21అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
22అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. 23“ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 24కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. 25మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు. 26ఒకవేళ మీరు ఇతరుల అపరాధాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ అపరాధాలను క్షమించరు.”#11:26 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
యేసు అధికారం ప్రశ్నించబడింది
27వారు తిరిగి యెరూషలేముకు చేరుకొన్నారు, యేసు దేవాలయ ఆవరణంలో నడుస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. 28వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? ఇవి చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
29అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను. 30యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండా? లేదా మానవుల నుండా?” అని వారిని అడిగారు.
31వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు. 32ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ ” అని చెప్తే, (వారు ప్రజలకు భయపడ్డారు. దానికి కారణం ప్రతి ఒక్కరు యోహాను నిజంగా ఒక ప్రవక్తని నమ్ముతున్నారు.)
33అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు.
అందుకు యేసు, “నేను ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను” అన్నారు.

Markierung

Teilen

Kopieren

None

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.

Videos zu మార్కు సువార్త 11