ఆది 4

4
కయీను హేబెలు
1అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు#4:1 కయీను హెబ్రీ పదంలా ఉంది సంపాదించాను. జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది. 2తర్వాత అతని సహోదరుడైన హేబెలుకు జన్మనిచ్చింది.
హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు. 3కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. 4హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు. 5కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు.
6అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు? 7నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి.”
8ఒక రోజు కయీను తన తమ్మున్ని పిలిచి, “మనం పొలానికి వెళ్దాం” అని అన్నాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు.
9అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు.
అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు.
10అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. 11ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు. 12నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు.
13కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది. 14ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.
15అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు. 16కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు#4:16 నోదు అంటే తిరుగుతూ ఉండడం (12; 14 వచనాలు చూడండి). దేశంలో నివసించాడు.
17కయీను తన భార్యను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై హనోకుకు జన్మనిచ్చింది. అప్పుడు కయీను ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, దానికి హనోకు అని తన కుమారుని పేరు పెట్టాడు. 18హనోకుకు ఈరాదు పుట్టాడు, ఈరాదు మెహూయాయేలు తండ్రి, మెహూయాయేలు మెతూషాయేలుకు తండ్రి, మెతూషాయేలు లెమెకుకు తండ్రి.
19లెమెకు ఇద్దరిని భార్యలుగా చేసుకున్నాడు, ఒకరు ఆదా ఇంకొకరు సిల్లా. 20ఆదా యాబాలుకు జన్మనిచ్చింది; అతడు గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచేవారికి మూలపురుషుడు. 21అతని తమ్ముని పేరు యూబాలు, అతడు తంతి వాయిద్యాలు వాయించే వారికి మూలపురుషుడు. 22సిల్లా కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది, అతని పేరు తూబల్-కయీను, అతడు అన్ని రకాల ఇత్తడి ఇనుప పనిముట్లు తయారుచేయడంలో నిపుణుడు. తూబల్-కయీను యొక్క సోదరి నయమా.
23ఒక రోజు లెమెకు తన భార్యలతో,
“ఆదా, సిల్లా నా మాట ఆలకించండి;
లెమెకు భార్యలారా, నా పలుకులు వినండి.
నాకు గాయం చేసినందుకు ఒక మనుష్యుని,
నన్ను గాయపరిచినందుకు ఒక యువకుడిని చంపాను.
24కయీనును చంపితే ఏడు రెట్లు శిక్ష పడితే,
లెమెకును చంపితే డెబ్బై ఏడు రెట్లు”
అని అన్నాడు.
25ఆదాము తన భార్యను మరోసారి లైంగికంగా కలుసుకున్నప్పుడు, ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చి, “దేవుడు, కయీను చంపిన నా కుమారుడు హేబెలుకు బదులుగా మరొక శిశువునిచ్చారు” అని అతనికి షేతు#4:25 షేతు బహుశ దీని అర్థం అనుగ్రహించబడినవాడు అని పేరు పెట్టింది. 26షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు.
అప్పటినుండి ప్రజలు యెహోవా నామంలో ప్రార్థించడం మొదలుపెట్టారు.

Valgt i Øjeblikket:

ఆది 4: OTSA

Markering

Del

Kopiér

None

Vil du have dine markeringer gemt på tværs af alle dine enheder? Tilmeld dig eller log ind