Logo YouVersion
Ikona vyhledávání

మత్తయి 24

24
దేవాలయాన్ని పడగొట్టుట, చివరి దినాలలో రాకడకు సూచనలు
1యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించారు. 2అందుకు యేసు, “మీరు ఇవన్ని చూస్తున్నారా? ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
3యేసు ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు మరియు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు.
4యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. 5ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. 6మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగవలసివుంది, కాని అంతం రావలసి ఉంది. 7జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. 8ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.
9“అప్పుడు హింసించబడడానికి మరియు మరణానికి మీరు అప్పగించబడతారు, నన్ను బట్టి మీరు అన్ని రాజ్యాల చేత ద్వేషించబడతారు. 10ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు. 11అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతో మందిని మోసపరుస్తారు. 12దుష్టత్వం ఎక్కువైపోతుండడం వల్ల అనేకుల ప్రేమ చల్లారుతుంది. 13కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. 14ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది.
15“కనుక ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు,#24:15 దాని 9:27; 11:31; 12:11 దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, చదివేవాడు అర్థం చేసుకొనును గాక. 16అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. 17ఇంటిపైన ఉన్న వారెవరు కిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేనిని బయటకు తీసుకురాకూడదు. 18పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనక్కి వెళ్లకూడదు. 19ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! 20అందుకే చలికాలంలో కాని సబ్బాతు దినాన కాని పారిపోయే పరిస్థితి రాకుండా ప్రార్థించండి. 21ఎందుకంటే లోకం సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమకాలాలు రాలేదు. మరి ఎప్పటికి రావు.
22“ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని ఎన్నుకోబడినవారి కొరకు ఆ రోజులు తగ్గించబడతాయి. 23ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే, నమ్మకండి. 24ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు. 25ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను.
26“కనుక ఎవరైనా, ‘ఇదిగో, ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని మీతో చెబితే, వెళ్లకండి; లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ, లోపలి గదిలో ఉన్నాడు’ అని చెప్పితే నమ్మకండి. 27మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో, అలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది. 28ఎక్కడ పీనుగు ఉంటే అక్కడ గద్దలు పోగవుతాయి.
29“ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే,
“ ‘సూర్యుడు నల్లగా మారుతాడు,
చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.
ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి,
ఆకాశ సంబంధమైనవి కదలిపోతాయి.’#24:29 యెషయా 13:10; 34:4
30“అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, మహామహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు.#24:30 దాని 7:13-14 31గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయన ఎన్నుకొన్న వారిని పోగుచేస్తారు.
32“అంజూరపు చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూరపు కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది. 33ఆ ప్రకారంగానే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ దగ్గరలో, ద్వారం దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి. 34ఇవన్ని జరిగే వరకు, ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. 35ఆకాశం మరియు భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏ మాత్రం గతించవు.
ఆ దినము మరియు ఆ సమయం ఎప్పుడో ఎవరికీ తెలియదు
36“అయితే ఆ దినము గురించి ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు, 37నోవహు దినాల్లో ఎలా ఉన్నదో, మనుష్యకుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది. 38జలప్రళయానికి ముందు దినాలలో, నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకు, ప్రజలు తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. 39ఆ జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు వారికి తెలియలేదు. మనుష్యకుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. 40ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకుపోబడతారు ఇంకొకరు విడవబడుతారు. 41ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుంటారు, ఒక స్త్రీ తీసుకుపోబడుతుంది ఇంకొక స్త్రీ విడవబడుతుంది.
42“కనుక ఏ దినము మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండండి. 43ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా మెలకువగా ఉంటాడు. 44మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కనుక మీరు సిద్ధపడి ఉండండి.
45“యజమాని తన ఇంట్లోని పనివారికి తగిన సమయాల్లో భోజనం పెట్టి, వారిని పర్యవేక్షించడానికి వారిపై పర్యవేక్షకునిగా నియమించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన సేవకుడు ఎవడు? 46యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు అలా చేస్తూ కనిపించడం మంచిది. 47ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని, నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 48కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని, 49తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు. 50అతడు ఊహించని రోజున అనుకొనని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. 51అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas

Video k మత్తయి 24