Logo YouVersion
Ikona vyhledávání

మత్తయి 22

22
పెండ్లి విందును గురించిన ఉపమానము
1యేసు మరలా ఉపమానరీతిలో వారితో మాట్లాడుతూ, 2“పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారుని కొరకు ఏర్పాటు చేసిన గొప్ప పెండ్లి విందును పోలి ఉంది. 3ఆ పెండ్లివిందుకు పిలువబడినవారిని రమ్మని పిలువడానికి అతడు తన పనివారిని పంపించాడు, కాని వారు రావడానికి తిరస్కరించారు.
4“కనుక ఆయన ఆహ్వానించిన వారి దగ్గరకు మరికొందరు పనివారిని పంపించి, ‘ఇదిగో, నేను విందు సిద్ధపరిచాను: నా ఎద్దులను మరియు క్రొవ్విన పశువులను వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెండ్లివిందుకు రండి’ అని చెప్పమన్నాడు.
5“కానీ వారు అతని మాటలు లెక్క చేయకుండా ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్లిపోయారు. 6మిగిలిన వారు ఆ పిలుపును తెచ్చిన పనివారిని పట్టుకొని, అవమానించి వారిని చంపారు. 7కనుక రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణాన్ని తగులబెట్టించాడు.
8“అప్పుడు అతడు తన పనివారితో, ‘పెండ్లి విందు సిద్ధంగా ఉంది, గాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు. 9కనుక మీరు వీధి మూలలకు పోయి మీకు కనబడిన వారినందరిని పెండ్లివిందుకు ఆహ్వానించండి’ అని తన పనివారితో చెప్పాడు. 10ఆ పనివారు వీధులలోనికి పోయి తమకు కనబడిన చెడ్డవారిని, మంచివారిని అందరిని పోగుచేశారు, కాబట్టి ఆ పెండ్లి వేదిక అంతా విందుకు వచ్చిన అతిథులతో నిండిపోయింది.
11“కాని ఆ రాజు అతిథులను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు, అక్కడ పెండ్లి వస్త్రాలను వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు. 12రాజు వానితో, ‘స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. వాడు మౌనంగా ఉండిపోయాడు.
13“అప్పుడు ఆ రాజు తన పనివారితో, ‘వీని చేతులు కాళ్లు కట్టి, బయట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి’ అని చెప్పారు.
14“అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఎన్నుకోబడ్డారు.”
కైసరుకు పన్ను చెల్లించుట
15అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును తన మాటల్లోనే ఎలా చిక్కించాలని ఆలోచించారు. 16హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యదార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కనుక ఇతరులచే నీవు ప్రభావితం కావు. 17అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు” అని అడిగారు.
18అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? 19పన్నుకట్టే ఒక నాణెము నాకు చూపించండి” అన్నారు. అందుకు వారు ఒక దేనారం తెచ్చారు. 20ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు.
21వారు, “కైసరువి” అన్నారు.
అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
22వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కనుక ఆయనను విడిచి వెళ్లిపోయారు.
పునరుత్థానంలో వివాహం
23పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు అదే రోజు యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. 24“బోధకుడా, ఒకడు సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే చెప్పాడు. 25అలా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటి వాడు పెళ్లి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయాడు. కనుక అతని తమ్ముడు అతని విధవను చేసుకొన్నాడు. 26అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడోవాని వరకు అలాగే జరిగింది. 27చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. 28అయితే, వారందరు ఆమెను పెళ్ళి చేసుకున్నారు గనుక, పునరుత్థానంలో ఆ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్య అవుతుంది?” అని ఆయనను అడిగారు.
29అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కనుక మీరు పొరపాటు పడుతున్నారు. 30పునరుత్థానంలో ప్రజలు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. 31మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, 32యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు.”#22:32 నిర్గమ 3:6 అని చెప్పారు.
33జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
గొప్ప ఆజ్ఞ
34యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు. 35వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు, యేసును పరీక్షిస్తూ, 36“బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.
37అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’#22:37 ద్వితీ 6:5 38ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. 39రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి.’#22:39 లేవీ 19:18 40ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల మాటలకు ఆధారంగా ఉన్నాయి” అని అతనితో చెప్పారు.
క్రీస్తు ఎవరి కుమారుడు?
41పరిసయ్యులు ఒకచోట కూడి ఉన్నప్పుడు యేసు వారిని ఈ విధంగా అడిగారు, 42“క్రీస్తును గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?”
అందుకు వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.
43అందుకాయన, “అలాగైతే దావీదు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను ‘ప్రభువు’ అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఇలా అన్నాడు,
44“ ‘నేను నీ శత్రువులను
నీకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’#22:44 కీర్తన 110:1
45దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిస్తే, ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు. 46ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు, మరియు ఆ రోజు నుండి ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas

Video k మత్తయి 22