యోహాను 18
18
యేసు అప్పగించబడుట
1యేసు ప్రార్థించిన తర్వాత, తన శిష్యులతో కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోనికి ఆయన తన శిష్యులతో కలిసి వెళ్లారు.
2యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కనుక ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు. 3కనుక యూదా తనతో సైనికుల గుంపును మరియు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో మరియు ఆయుధాలతో తోటకు వచ్చాడు.
4యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
5“నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు.
“ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు. 6యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు.
7ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
అందుకు “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు.
8అందుకు యేసు, “నేనే ఆయనను అని మీతో చెప్పాను, ఒకవేళ మీరు నా కొరకే వెదకుతున్నట్లయితే, వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు. 9“నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు”#18:9 యోహాను 6:39 అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది.
10అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు.
11అప్పుడు యేసు పేతురును “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు.
12అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు. 13వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకొనివెళ్లారు. 14ప్రజలందరు నశించిపోకుండా వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే.
మొదటిసారి పేతురు నిరాకరించుట
15సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కనుక, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు. 16కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుని పరిచయుడైన ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి, అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకు వచ్చాడు.
17ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కావు కదా?” అని పేతురును అడిగింది.
అందుకు అతడు “నేను కాదు” అన్నాడు.
18అప్పుడు చలిగా ఉన్నందుకు సేవకులు మరియు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు.
ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించుట
19ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు.
20అందుకు యేసు “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను, ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరంలో లేదా దేవాలయంలోనే నేను బోధించాను, నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు. 21నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు.
22యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడివున్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంప మీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు.
23అందుకు యేసు “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు. 24అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు.
రెండవ సారి మరియు మూడవసారి పేతురు నిరాకరించుట
25సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు, వారు “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు.
అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు.
26ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువు, “నేను నిన్ను ఒలీవల తోటలో ఆయనతో చూడలేదా?” అని అడిగాడు. 27పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.
పిలాతు యెదుటకు యేసు
28అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప వద్దనుంచి రోమా అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు, అప్పటికి తెల్లవారింది కనుక అపవిత్రపడకుండా పస్కాను తినాలని వారు భవనంలోనికి వెళ్లలేదు. 29కనుక పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఈయనకు వ్యతిరేకంగా ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు.
30వారు “ఆయన నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు.
31పిలాతు, “అతన్ని మీరే తీసుకువెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు.
అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు. 32యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
33తర్వాత పిలాతు భవనంలోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34యేసు, “అది నీ స్వంత ఆలోచనా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు.
35పిలాతు, “నేనేమైనా యూదుడనా? నీ సొంత ప్రజలు ముఖ్యయాజకులే నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేసావు?” అని అడిగాడు.
36యేసు, “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండి ఉంటే, యూదా నాయకులు నన్ను బంధించకుండా ఉండడానికి నా సేవకులు వారితో పోరాడి ఉండేవారు. కాని నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చారు.
37అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు.
అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు.
38పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, “ఈయనను నిందించడానికి తగిన ఏ నేరం నాకు కనిపించలేదు. 39కాని పస్కా పండుగ సమయంలో నేరస్థులలో ఒకరిని నేను మీ కొరకు విడుదల చేసే ఆచారం ఉంది కనుక, యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వారిని అడిగాడు.
40అందుకు వారు, “వద్దు, ఆయన వద్దు! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని గట్టిగా కేకలు వేశారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.
Právě zvoleno:
యోహాను 18: TCV
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.