యోహాను సువార్త 16
16
1“మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదని నేను మీకు ఈ సంగతులను చెప్పాను. 2వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు దేవుని కోసం మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది. 3వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కాబట్టి వారు ఇలాంటి పనులను చేస్తారు. 4అవి జరిగేటప్పుడు ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్పాను. మొదట్లో ఈ సంగతులను మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతోనే ఉన్నాను. 5ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. 6కానీ నేను చెప్పిన ఈ సంగతులను గురించి మీ హృదయాలు దుఖంతో నిండి ఉన్నాయి. 7అయితే నేను మీతో చెప్పేది నిజం, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకస్తులను తప్పు ఒప్పుకునేలా చేస్తాడు. 9-10ప్రజలు నన్ను నమ్మలేదు కాబట్టి వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఇక మీరు నన్ను చూడరు కాబట్టి వారి నీతిని గురించి, 11ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు కాబట్టి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు.
12“మీతో ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు. 13అయితే సత్యమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను మాట్లాడడు; తాను విన్నవాటినే ఆయన చెప్తాడు, జరుగబోయే వాటిని మీకు చెప్తాడు. 14ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియచేస్తూ నన్ను మహిమపరుస్తాడు. 15నా తండ్రికి ఉన్నవన్నీ నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.”
శిష్యుల దుఃఖం సంతోషంగా మారును
16యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.”
17అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన చెప్తున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కాబట్టి ‘కొద్ది కాలం మీరు నన్ను చూడరు. ఆ తర్వాత కొంతకాలానికి మీరు నన్ను చూస్తారు’ అనే మాటలకు అర్థం ఏమైయుంటుంది?” అని చెప్పుకొన్నారు. 18వారు, “ ‘ఇంకా కొద్ది సమయం’ అంటే ఆయన అర్థమేంటి? ఆయన ఏమి చెప్తున్నారో మనకు అర్థం కావడం లేదు” అని అనుకున్నారు.
19యేసు తన శిష్యులు ఆ విషయం గురించి తనను అడగాలని అనుకుంటున్నారని గ్రహించి వారితో, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, దాని తర్వాత ఇంకొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు” అని నేను చెప్పినదాని గురించి మీరు ఒకరిని ఒకరు అడుగుతున్నారా? 20నేను మీతో చెప్పేది నిజం, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. 21ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది. 22మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు. ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు. 23ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తారని నేను మీతో చెప్పేది నిజం. 24ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.
25“ఇంతవరకు నేను మీతో ఉపమానాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. 26ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు. 27ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 28నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు.
29అప్పుడు యేసు శిష్యులు, “ఇప్పుడు నీవు ఉపమానాలతో కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని మేము గ్రహిస్తున్నాము. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
31యేసు వారితో, “ఇప్పుడు మీరు నమ్ముతున్నారా?” అన్నారు. 32“ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు.
33“ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.
Právě zvoleno:
యోహాను సువార్త 16: TSA
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.