అపొస్తలుల కార్యములు 11
11
పేతురు తన పనులను వివరించుట
1యూదేతరులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించారని యూదయ ప్రాంతమంతటిలో ఉన్న అపొస్తలులు విశ్వాసులు విన్నారు. 2కాబట్టి పేతురు యెరూషలేముకు తిరిగి వెళ్లినప్పుడు, సున్నతి పొందిన విశ్వాసులు అతన్ని విమర్శించి, 3“నీవు సున్నతి పొందని వారి ఇంటికి వెళ్లి వారితో భోజనం చేశావు” అన్నారు.
4అప్పుడు పేతురు మొదటి నుండి జరిగినదంతా వారితో చెప్పాడు, 5“నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలో ఒక దర్శనం చూశాను. అందులో పరలోకం నుండి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి నేనున్న చోటికి దిగి రావడం చూశాను. 6భూమిపై ఉండే నాలుగు కాళ్ల జంతువుల, అడవి మృగాలు, ప్రాకే ప్రాణులు పక్షులు దానిలో ఉండడం నేను చూశాను. 7అప్పుడు ఒక స్వరం నాతో, ‘పేతురు లేచి, వాటిని చంపుకొని తిను’ అని చెప్పడం విన్నాను.
8“అందుకు నేను ‘లేదు, ప్రభువా! అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ నా నోటిలోనికి రాలేదు’ అన్నాను.
9“రెండవసారి పరలోకం నుండి ఆ స్వరం నాతో, ‘దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు’ అని చెప్పడం వినబడింది. 10ఈ విధంగా మూడుసార్లు జరిగింది, ఆ తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి కొనిపోబడింది.
11“అలా జరిగిన వెంటనే నా కోసం కైసరయ పట్టణం నుండి పంపబడిన ముగ్గురు వ్యక్తులు నేను ఉన్న ఇంటి ముందు నిలబడ్డారు. 12అప్పుడు ఆత్మ నాతో, వారితో వెళ్లడానికి సందేహించవద్దు అని ఆదేశించాడు. ఈ ఆరుగురు సహోదరులు కూడా నాతో వచ్చారు, మేము ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాము. 13అతడు తన ఇంట్లో ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, ‘యొప్పేకు మనుష్యులను పంపించి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. 14అతడు తెచ్చే సందేశం ద్వారా నీవు నీ ఇంటివారందరు రక్షించబడతారని’ చెప్పాడని మాతో చెప్పాడు.
15“నేను బోధించడం మొదలుపెట్టగానే ప్రారంభంలో మన మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగానే వారి మీదకు కూడా దిగివచ్చాడు. 16అప్పుడు: ‘యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు’ అని ప్రభువు చెప్పినది నేను జ్ఞాపకం చేసుకున్నాను. 17ప్రభువైన యేసు క్రీస్తును నమ్మిన మనకు ఇవ్వబడిన వరాన్నే దేవుడు వారికి కూడా ఇస్తే, దేవుని అడ్డగించి నిలబడడానికి నేను ఎవరిని?” అని వారితో అన్నాడు.
18వారు ఈ మాటలను విన్నప్పుడు, వారు ఏ అభ్యంతరం చెప్పకుండా, “అయితే దేవుడు యూదేతరులకు కూడా జీవంలోనికి నడిపించే పశ్చాత్తాపాన్ని అనుగ్రహించాడని” చెప్పుకుంటూ దేవుని స్తుతించారు.
అంతియొకయ పట్టణంలోని సంఘం
19స్తెఫెను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు. 20వారిలో కుప్ర కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు. 21ప్రభువు హస్తం వారికి తోడుగా ఉన్నందున, పెద్ద సంఖ్యలలో ప్రజలు నమ్మి, ప్రభువు వైపు తిరిగారు.
22ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు. 23అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు. 24బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు.
25ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి, 26అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు.
27ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు. 28వారిలో అగబు అనే పేరు కలవాడు నిలబడి, రోమా సామ్రాజ్యం అంతటా గొప్ప కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అతడు చెప్పింది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది. 29అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి తమ శక్తికొలది యూదయలో నివసిస్తున్న విశ్వాసులకు సహాయం అందించడానికి నిశ్చయించుకున్నారు. 30కాబట్టి వారు బర్నబా సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.
Právě zvoleno:
అపొస్తలుల కార్యములు 11: TSA
Zvýraznění
Sdílet
Kopírovat

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.