జెఫన్యా 2
2
దేశాలతో పాటు యూదా యెరూషలేము కూడా తీర్పుకు గురయ్యాయి
పశ్చాత్తాపపడాలని యూదాకు పిలుపు
1సిగ్గుమాలిన దేశమా,
సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి
2శాసనం అమలులోకి రాకముందే
ఆ దినం గాలికి కొట్టుకుపోయే పొట్టులా కనుమరుగు కాక ముందే,
యెహోవా కోపాగ్ని
మీ మీదికి రాకముందే,
యెహోవా ఉగ్రత దినం
మీ మీదికి రాకముందే సమకూడండి.
3దేశంలోని సమస్త దీనులారా,
ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి.
నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి;
యెహోవా కోప్పడే దినాన
బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.
ఫిలిష్తీయ
4గాజా విడిచిపెట్టబడుతుంది,
అష్కెలోను పాడైపోతుంది.
మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది,
ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది.
5సముద్రతీరాన కాపురమున్న
కెరేతీయులారా! మీకు శ్రమ.
ఫిలిష్తీయ ప్రజలు కాపురమున్న కనాను దేశమా!
యెహోవా వాక్కు నీకు వ్యతిరేకంగా ఉంది,
“నీలో ఎవరూ మిగలకుండా
నేను నిన్ను నాశనం చేస్తాను” అని ఆయన అంటున్నారు.
6సముద్రతీరాన ఉన్న దేశం,
గొర్రెల కాపరులకు పచ్చికబయళ్లుగా అవుతుంది;
బావులు, మందల కోసం దొడ్లు ఉంటాయి.
7ఆ ప్రాంతం యూదా వంశంలో
మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది.
వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు,
వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి
ఆయన వారిని రప్పిస్తారు.
వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు.
సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు.
మోయాబు, అమ్మోను
8“నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి
వారిని దూషించిన,
మోయాబు వారు చేసిన అవమానాల గురించి,
అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను.
9కాబట్టి, నా జీవం తోడు,
మోయాబు సొదొమలా,
అమ్మోను గొమొర్రాలా అవుతుంది.
కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో,
అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి.
నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు;
నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు”
అని ఇశ్రాయేలు దేవుడైన
సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
10ఈ విధంగా వారు గర్వంతో,
సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు,
ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.
11ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు
యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు.
ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి,
ఆయనకు నమస్కారం చేస్తారు.
కూషు
12“కూషీయులారా, మీరు కూడా
నా ఖడ్గం చేత చంపబడతారు.”
అష్షూరు
13ఆయన తన చేయి ఉత్తరం వైపు చాచి
అష్షూరును నాశనం చేస్తారు.
నీనెవెను పూర్తిగా నిర్జనమై
ఎడారిలా ఎండిపోయేలా చేస్తారు.
14గొర్రెల మందలు, పశువుల మందలు,
దేశంలోని అన్ని రకాల జీవులు అక్కడ పడుకుంటాయి.
ఎడారి గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ
దాని స్తంభాలపై కూర్చుంటాయి.
వారి కూత కిటికీల గుండా ప్రతిధ్వనిస్తుంది,
రాళ్లతో తలుపులు నిండిపోతాయి,
దేవదారు దూలాలు నాశనమవుతాయి.
15ఇది క్షేమకరమైన
ఆనందకరమైన పట్టణము.
ఆమె తనలో తాను,
“నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది.
ఆమె ఎంతగా పాడైపోయింది,”
క్రూరమృగాలకు గుహలా మారింది!
ఆ దారి గుండా వెళ్లే వారందరూ
ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.
Currently Selected:
జెఫన్యా 2: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.