YouVersion Logo
Search Icon

తీతు పత్రిక 2

2
సువార్త కోసం మంచి చేయుట
1నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. 2వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.
3అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు. 4అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని, 5స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు.
6అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు. 7నీవు ప్రతి విషయంలో వారికి మాదిరిగా జీవిస్తూ, ఏది మంచిదో అదే చేస్తూ, నీ బోధలలో నిజాయితీని, గంభీరతను చూపిస్తూ, 8మంచి మాటలనే ఉపయోగించు, అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారికి నీ గురించి చెడుగా చెప్పడానికి ఏమి ఉండదు, కాబట్టి వారు సిగ్గుపడతారు.
9దాసులుగా ఉన్నవారు తమ యజమానులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలని, అన్ని విధాలుగా వారిని సంతోషపరచడానికి ప్రయత్నించాలని, వారికి ఎదురు చెప్పకూడదని, 10యజమానుల నుండి ఏదీ దొంగతనం చేయకుండా, తాము నమ్మదగిన వారని నిరూపించుకోవాలని దాసులకు బోధించు, అప్పుడు వారు ప్రతి విషయంలో మన రక్షకుడైన దేవుని బోధను ఆకర్షణీయంగా చేస్తారు.
11మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. 12-13మనం భక్తిహీనతను ఈ లోక కోరికలను తృణీకరించి, దివ్య నిరీక్షణ కోసం అనగా, మన గొప్ప దేవుడును రక్షకుడైన యేసు క్రీస్తు తన మహిమతో కనబడతాడనే ఆ దివ్య నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ, స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది. 14యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.
15కాబట్టి ఈ విషయాలను నీవు వారికి బోధించాలి, నీకు ఇవ్వబడిన పూర్తి అధికారంతో వారిని హెచ్చరించి గద్దించు. నిన్ను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in