YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 13

13
అధికారుల అధికారానికి లోబడుట
1దేవుడు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కాబట్టి ప్రతీ వ్యక్తి తన పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. 2కాబట్టి ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తున్నారో వారు దేవుడు నియమించిన దాన్ని ఎదిరిస్తున్నారు. అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు. 3మంచి పనులు చేసేవారిని పరిపాలకులు భయపెట్టరు; అయితే తప్పు చేసే వారికే వారంటే భయం. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలంటే మీరు మంచి పనులు చేయాలి. 4మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు. 5కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండాలి.
6అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము. 7మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి.
ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది
8ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి దేనిలో ఎవరికి రుణపడి ఉండవద్దు. 9“మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు”#13:9 నిర్గమ 20:13-15,17; ద్వితీ 5:17-19,21 అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి”#13:9 లేవీ 19:18 అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. 10ప్రేమ పొరుగువారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
ప్రభువు దినం సమీపంగా ఉంది
11ప్రస్తుత సమయాన్ని తెలుసుకుని మీరు నిద్రమత్తు నుండి మేల్కోవలసిన సమయం వచ్చిందని గ్రహించండి. ఎందుకంటే మనం మొదట్లో నమ్మినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది. 12రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము. 13అతి త్రాగి మత్తులు కావడం, హద్దు అదుపు లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వ్యభిచారం చేయడం, గొడవపడడం, అసూయపడడం మొదలైన వాటిని విడిచి, పగటివేళ నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. 14మీరు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించకండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in