YouVersion Logo
Search Icon

ప్రకటన 13

13
సముద్రం నుండి వచ్చిన మృగం
1ఆ ఘటసర్పం సముద్రపు ఒడ్డున నిలబడింది. ఇంతలో సముద్రంలో నుండి ఒక మృగం బయటకు రావడం నేను చూశాను. దానికి ఏడు తలలు పది కొమ్ములు, దాని కొమ్ములకు పది కిరీటాలు, దాని ప్రతి తలమీద దైవదూషణ చేసే పేరు ఉంది. 2నేను చూసిన ఆ మృగం చిరుతపులిని పోలి ఉంది, కాని దాని కాళ్లు ఎలుగుబంటి కాళ్లలా, దాని నోరు సింహం నోరులా ఉన్నాయి. ఆ ఘటసర్పం తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మృగానికి ఇచ్చింది. 3ఆ మృగం తలల్లో ఒకదానికి చనిపోయేంతగా గాయం తగిలినట్లు ఉన్నది కానీ ఆ గాయం పూర్తిగా మానిపోయింది. అందుకు భూలోక ప్రజలంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని వెంబడించారు. 4ఘటసర్పం ఆ మృగానికి అధికారం ఇచ్చింది కాబట్టి ప్రజలు దాన్ని పూజించారు. వారు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వంటివారు ఎవరు? ఈ మృగంతో యుద్ధం చేసి గెలవగలవారు ఎవరు?” అని చెప్పుకున్నారు.
5ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు చెప్తూ దైవదూషణ చేసే నోరు ఉంది. నలభై రెండు నెలల వరకు అధికారం చెలాయించడానికి అనుమతి ఇవ్వబడింది. 6ఆ మృగం దేవుని దూషించడానికి, దేవుని నామాన్ని, ఆయన నివాస స్థలాన్ని, దేవునితో జీవించే పరలోక నివాసులను దూషించడానికి నోరు తెరిచింది. 7దేవుని ప్రజల మీద యుద్ధం చేసి వారిని జయించడానికి ఆ మృగానికి అనుమతి ఇవ్వబడింది. ప్రతి గోత్రాన్ని, ప్రజలను, ప్రతి భాష మాట్లాడేవారిని, ప్రతి దేశాన్ని ఏలడానికి దానికి అధికారం ఇవ్వబడింది. 8లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని పూజిస్తారు.
9చెవులుగలవారు విందురు గాక!
10“చెరలోనికి వెళ్లవలసినవారు
చెరలోనికి వెళ్తారు.
ఖడ్గంతో హతం కావలసిన వారు
ఖడ్గంతో హతం అవుతారు.”#13:10 యిర్మీయా 15:2
ఇది దేవుని ప్రజలు తమ విశ్వాసానికి నమ్మకంగా ఉండి సహనాన్ని చూపించాల్సిన సమయం.
భూమిలో నుండి వచ్చిన మృగం
11దాని తర్వాత రెండవ మృగం భూమిలో నుండి రావడం నేను చూశాను. దానికి గొర్రెపిల్లను పోలిన రెండు కొమ్ములు ఉన్నాయి, కాని అది ఘటసర్పంలా మాట్లాడింది. 12ఆ రెండవ మృగం మొదటి మృగానికి ఉన్న అధికారమంతటిని చెలాయిస్తూ, చనిపోయేంత గాయం నుండి స్వస్థపడిన ఆ మొదటి మృగాన్ని భూమి దాని నివాసులు ఆరాధించేలా చేసింది. 13అది గొప్ప సూచనలు చేస్తూ, మనుష్యులు చూస్తున్నప్పుడే ఆకాశం నుండి భూమి మీద అగ్నిని కురిసేలా చేస్తుంది. 14రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దాని కోసం అద్భుతాలను చేస్తూ భూనివాసులందరినీ మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బ్రతికిన ఆ మొదటి మృగం కోసం విగ్రహం చేయమని వారిని ఆదేశించింది. 15అంతేకాక మొదటి మృగం యొక్క విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికి, తద్వారా ఆ విగ్రహాన్ని పూజించని వారందరిని చంపించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. 16ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. 17ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది.
18దానిలో జ్ఞానం ఉంది. పరిజ్ఞానం కలవాడు ఆ మృగపు సంఖ్యను లెక్కించి తెలుసుకొనును గాక! అది ఒక మానవుని సంఖ్య. ఆ సంఖ్య 666.

Currently Selected:

ప్రకటన 13: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in