కీర్తనలు 68
68
కీర్తన 68
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము.
1దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక;
ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక.
2మీరు వారిని పొగలా ఊదివేయండి;
మైనం అగ్నికి కరిగి పోయినట్టు
దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.
3కాని నీతిమంతులు సంతోషించి
దేవుని ఎదుట ఆనందించుదురు గాక
వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక.
4దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి,
మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి;
ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.
5తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు,
తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.
6దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో#68:6 లేదా నిర్జనంగా ఉన్నవారిని మాతృ భూమిలో ఉంచుతారు,
బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు;
కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.
7దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు,
అరణ్యం గుండా మీరు నడిచారు. సెలా
8సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు,
ఇశ్రాయేలు దేవుని ముందు,
భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి.
9దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు;
నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు.
10మీ జనులు అందులో స్థిరపడ్డారు,
దేవా, మీ దయతో పేదలకు అవసరమైనవి ఇచ్చారు.
11ప్రభువు తన మాటను చాటించారు,
స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు:
12“శత్రు రాజులు సైన్యాలు త్వరపడి పారిపోతారు;
ఇంటి పట్టున ఉన్న స్త్రీలు దోపుడుసొమ్ము పంచుకుంటారు.
13గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు కూడా,
నా పావురం యొక్క రెక్కలు వెండితో,
దాని ఈకలు మెరిసే బంగారంతో కప్పబడి ఉంటాయి.”
14సర్వశక్తిమంతుడు ఈ రాజులను చెదరగొట్టినప్పుడు
సల్మోను కొండమీద మంచు కురిసినట్లు కనిపించింది.
15దేవుని పర్వతమా, పర్వత శిఖరమా,
బాషాను పర్వతమా, కఠినమైన పర్వతమా,
16కఠినమైన పర్వతమా, దేవుడు పరిపాలించడానికి ఎన్నుకున్న పర్వతం వైపు
ఎల్లకాలమూ యెహోవా నివసించే స్థలం వైపు
ఎందుకు అసూయతో చూస్తావు?
17దేవుని రథాలు వేలాది కొలది
కోట్ల కొలదిగా ఉన్నాయి;
వాటి మధ్యలో, ప్రభువు సీనాయి పర్వతం నుండి తన పరిశుద్ధాలయానికి వచ్చి ఉన్నారు.
18యెహోవా దేవా, మీరు నిత్యం పాలించడానికి
పైకి ఆరోహణమైనప్పుడు,
మీరు అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లారు;
మీరు మనుష్యుల నుండి ఈవులు స్వీకరించారు,
తిరుగుబాటుదారుల నుండి కూడా స్వీకరించారు.
19అనుదినం మన భారాలు భరించే
మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా
20మన దేవుడు రక్షించే దేవుడు;
ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది.
21దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు,
అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు.
22ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను;
సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.”
23మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు,
మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి.
24దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది,
పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు.
25ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు;
వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు.
26మహా సమాజాలలో దేవుని స్తుతించండి;
ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి.
27చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది,
యూదా నాయకుల గొప్ప సమూహం,
జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.
28దేవా, మీ శక్తిని రమ్మని పిలువండి;
ఇంతకుముందు మీరు చేసినట్టుగా, మా దేవా,
మీ బలాన్ని మాకు చూపండి,
29యెరూషలేములో ఉన్న మీ దేవాలయాన్ని బట్టి
రాజులు మీకు కానుకలు తెస్తారు.
30దేవా! రెల్లు మధ్యలో ఉండే మృగాన్ని,
అడవి జంతువుల లాంటి దేశాల మధ్యలో ఉన్న ఎడ్ల గుంపును గద్దించండి.
అవి తగ్గించబడి వెండి కడ్డీలను పన్నుగా తెచ్చును గాక
యుద్ధాలంటే ఇష్టపడే దేశాలను చెదరగొట్టండి.
31ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు.
కూషు#68:31 అంటే, నైలు ఉపరితల ప్రాంతం తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది.
32భూలోక రాజ్యాల్లారా, దేవునికి పాడండి,
ప్రభువుకు స్తుతి పాడండి. సెలా
33అనాది కాలం నుండి మహా ఆకాశాల్లో స్వారీ చేసే,
తన స్వరంతో ఉరిమే ఆయనను కీర్తించండి.
34దేవుని శక్తిని ప్రకటించండి,
ఆయన ప్రభావం ఇశ్రాయేలుపై ఉన్నది,
ఆయన శక్తి అంతరిక్షంలో ఉంది.
35దేవా, మీరు మీ పరిశుద్ధాలయంలో భీకరులు;
ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల ప్రభావాన్ని ఇస్తారు.
దేవునికే స్తుతి కలుగును గాక!
Currently Selected:
కీర్తనలు 68: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.