సామెతలు 2
2
జ్ఞానం యొక్క నైతిక ప్రయోజనాలు
1నా కుమారుడా, నీవు నా మాటలను విని
నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే,
2జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి,
హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి.
3నీవు అంతరార్థం కోసం మొరపెడితే,
వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
4వెండిని వెదికినట్లు దానిని వెదికితే,
దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే,
5యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు,
దేవుని తెలివిని కనుగొంటావు.
6ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు;
తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.
7యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే,
నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు.
8ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే,
తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే.
9అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను,
ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు.
10జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది,
తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది.
11బుద్ధి నిన్ను కాపాడుతుంది,
వివేకం నీకు కావలి కాస్తుంది.
12దుష్టుల చెడు మార్గాల నుండి,
మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
13అలాంటివారు చీకటిదారిలో నడవడానికి,
తిన్నని మార్గాలను విడిచిపెడతారు.
14చెడు చేయడంలో సంతోషిస్తారు,
దుర్మార్గుల మూర్ఖత్వాన్ని బట్టి ఆనందిస్తారు.
15వారి త్రోవలు సరియైనవి కావు
వారు వంచనతో ఆలోచిస్తారు.
16జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి,
మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది.
17అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి
దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.
18ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది,
దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి.
19ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు
జీవమార్గాలను వారు చేరుకోలేరు.
20కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి,
నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి.
21యథార్థవంతులు దేశంలో నివసిస్తారు,
ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు.
22కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు
ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు.
Currently Selected:
సామెతలు 2: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.