సంఖ్యా 13
13
కనాను వేగుచూచుట
1యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“కనాను దేశాన్ని పరిశీలించడానికి కొంతమంది పురుషులను పంపు, ఈ దేశం ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్నాను. ప్రతి పితరుల గోత్ర నాయకుల్లో ఒకరిని పంపు.”
3యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారిని పారాను ఎడారి నుండి పంపాడు. వారందరు ఇశ్రాయేలీయుల నాయకులు.
4వారి పేర్లు ఇవి:
రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ;
5షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు;
6యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;
7ఇశ్శాఖారు గోత్రం నుండి, యోసేపు కుమారుడైన ఇగాలు;
8ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;
9బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ;
10జెబూలూను గోత్రం నుండి, సోది కుమారుడైన గదీయేలు;
11మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ;
12దాను గోత్రం నుండి, గెమలి కుమారుడైన అమ్మీయేలు;
13ఆషేరు గోత్రం నుండి, మిఖాయేలు కుమారుడైన సెతూరు;
14నఫ్తాలి గోత్రం నుండి, వోఫ్సీ కుమారుడైన నహబీ;
15గాదు గోత్రం నుండి, మాకీ కుమారుడైన గెయుయేలు.
16ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.)
17మోషే వారిని కనాను దేశాన్ని పరిశీలించమని పంపినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “మీరు దక్షిణ మార్గం గుండా వెళ్లి, కొండసీమ వైపు వెళ్లండి. 18ఆ దేశం ఎలా ఉందో, అందులోని ప్రజలు బలవంతులా, బలహీనులా, తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా అని చూడండి. 19వారు ఎలాంటి భూమిలో నివసిస్తున్నారు? అది మంచిదా చెడ్డదా? వారు ఎలాంటి పట్టణాల్లో నివసిస్తున్నారు? అవి కోటగోడలు లేనివా? లేదా కోటగోడలు కలవా? 20ఆ దేశపు మట్టి ఎలా ఉంది? అది సారవంతమైనదా కాదా? అక్కడ చెట్లున్నాయా లేవా? అక్కడి పండ్లలో కొన్ని తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి.” (అది ప్రథమ ద్రాక్షపండ్ల కాలము.)
21కాబట్టి వారు వెళ్లి సీను ఎడారి నుండి లెబో హమాతు వైపున, రెహోబు వరకు ఆ దేశాన్ని పరిశీలించారు. 22దక్షిణ దిక్కునుండి వెళ్లి, హెబ్రోనుకు వచ్చారు, అక్కడ అహీమాను, షేషయి, తల్మయి అనే అనాకు వంశస్థులు నివసించారు. (హెబ్రోను, ఈజిప్టులోని సోయను కంటే ఏడు సంవత్సరాల ముందే కట్టబడిన పురాతన పట్టణము.) 23వారు ఎష్కోలు#13:23 అంటే గెల; 24 వచనంలో కూడా లోయకు చేరుకున్నప్పుడు ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని ఇద్దరు వారి మధ్య కర్ర మీద మోసారు, దానితో పాటు కొన్ని దానిమ్మలు, అంజూరాలు కూడా తీసుకున్నారు. 24అక్కడ ఇశ్రాయేలీయులు ద్రాక్ష గెలను కోసినందుకు ఆ స్థలం ఎష్కోలు లోయ అని పిలువబడింది. 25ఆ దేశాన్ని పరిశీలించిన నలభైరోజల తర్వాత వారు తిరిగి వచ్చారు.
పరిశీలన యొక్క నివేదిక
26వారు పారాను ఎడారిలో కాదేషులో ఉన్న మోషే అహరోనులు, ఇశ్రాయేలు సర్వసమాజం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి, సర్వ సమాజానికి విశేషాలు చెప్పి, ఆ దేశ పండ్లను వారికి చూపించారు. 27వారు మోషేకు ఇచ్చిన నివేదిక ఇది: “మీరు పంపిన దేశానికి మేము వెళ్లాము. నిజంగా పాలు తేనెలు అక్కడ పారుతున్నాయి. ఇవి ఆ దేశంలోని పండ్లు. 28అయితే అక్కడి నివాసులు బలిష్ఠులు, వారి పట్టణాలు కోటగోడలు కలిగి ఉన్నాయి, చాలా పెద్దవి. అక్కడ అనాకీయులను కూడా చూశాము. 29అమాలేకీయులు దక్షిణాదిలో నివసిస్తారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ సీమలో ఉంటారు. కనానీయులు సముద్రతీరాన యొర్దాను నది ఒడ్డున నివసిస్తారు.”
30అప్పుడు కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంత పరుస్తూ, “తప్పకుండా మనం వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేయగలం” అని అన్నాడు.
31కానీ అతనితో కలసి వెళ్లినవారు, “మనం వారిపై దాడి చేయలేము; అక్కడి ప్రజలు మనకన్నా బలమైన వారు” అని అన్నారు. 32వారు పరిశీలించిన దేశం గురించి ఇశ్రాయేలీయుల మధ్య చెడ్డ నివేదికను వ్యాప్తి చేశారు. వారు, “మేము వేగు చూసిన భూమి దానిలో నివసించేవారిని మ్రింగివేస్తుంది. అక్కడ మేము చూసిన ప్రజలందరూ చాలా పెద్దగా ఉన్నారు. 33మేము అక్కడ ఆజానుబాహులను (అనాకు వంశస్థులు నెఫిలీము నుండి వచ్చినవారు) చూశాము. మా దృష్టిలో మేము మిడతల్లా కనిపించాం, వారికి కూడా అలాగే కనిపించాం” అని అన్నారు.
Currently Selected:
సంఖ్యా 13: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.