YouVersion Logo
Search Icon

లేవీయ 9

9
యాజకులు వారి పరిచర్యను ప్రారంభించుట
1ఎనిమిదవ రోజు మోషే అహరోనును అతని కుమారులను, ఇశ్రాయేలు గోత్ర పెద్దలను పిలిపించాడు. 2అతడు అహరోనుతో ఇలా అన్నాడు, “మీ పాపపరిహారబలి కోసం ఏ లోపం లేని ఒక మగ దూడను, మీ దహనబలికి ఒక లోపం లేని పొట్టేలును తీసుకువచ్చి వాటిని యెహోవా ఎదుట సమర్పించాలి. 3అప్పుడు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారబలి కోసం లోపం లేని ఒక మేకపోతును దహనబలి కోసం లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి. 4యెహోవా ఎదుట బలి అర్పించడానికి సమాధానబలికి ఎద్దును,#9:4 హెబ్రీ పదం మగదానిని లేదా ఆడదానిని సూచించవచ్చు; 18, 19 వచనాల్లో కూడా. పొట్టేలును, ఒలీవనూనె కలిపిన భోజనార్పణతో పాటు తీసుకురండి. ఎందుకంటే యెహోవా ఈ రోజు మీకు ప్రత్యక్షమవుతారు.’ ”
5వారు మోషే ఆజ్ఞాపించినట్లుగా సమావేశ గుడారం ఎదుటికి వాటన్నిటిని తీసుకువచ్చారు, అప్పుడు సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. 6అప్పుడు మోషే ఇలా అన్నాడు, “మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించారు, తద్వార యెహోవా మహిమ మీకు ప్రత్యక్షం అవుతుంది.”
7మోషే అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఆజ్ఞాపించినట్లు బలిపీఠం దగ్గరకు వచ్చి, నీ పాపపరిహారబలిని, దహనబలిని అర్పించి, నీకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి; ప్రజల కోసం అర్పణను అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”
8కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి సమీపించి తన పాపపరిహారబలిగా కోడెను వధించాడు. 9అహరోను కుమారులు దాని రక్తాన్ని అతనికి అందించారు, ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠం కొమ్ములకు రాశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోశాడు. 10యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు బలిపీఠం మీద పాపపరిహారబలిగా దాని క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం దగ్గర ఉన్న క్రొవ్వును దహించాడు. 11దాని మాంసాన్ని, చర్మాన్ని, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.
12తర్వాత అతడు దహనబలిని వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అతనికి అందించగా, అతడు దానిని బలిపీఠం చుట్టూరా చల్లాడు. 13వారు అతనికి దహనబలి తలను దాని ముక్కలను ఇవ్వగా, అతడు వాటిని బలిపీఠం మీద కాల్చాడు. 14లోపలి అవయవాలను, కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహనబలిపైన వాటిని కాల్చాడు.
15అప్పుడు అహరోను ప్రజల అర్పణను తీసుకువచ్చాడు. అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకను తీసుకుని దానిని వధించి మొదటి దానిని చేసినట్లుగానే దీన్ని కూడా పాపపరిహారబలిగా అర్పించాడు.
16అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు. 17అతడు భోజనార్పణ కూడా తీసుకువచ్చి, దానిలో నుండి పిడికెడు తీసి బలిపీఠంపై దానిని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు.
18ప్రజల నిమిత్తం అహరోను సమాధానబలిగా ఎద్దును, పొట్టేలును వధించాడు. అతని కుమారులు అతనికి రక్తాన్ని అందించగా, అతడు బలిపీఠం చుట్టూరా దానిని చల్లాడు. 19ఎద్దు క్రొవ్వును, పొట్టేలు క్రొవ్వును, క్రొవ్విన తోకను, లోపల అవయవాల మీద ఉన్న క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం మీది క్రొవ్వును 20బోరల మీద వేశారు, అహరోను ఆ క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాడు. 21మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్ని, కుడి తొడను పైకెత్తి ఊపి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.
22తర్వాత అహరోను ప్రజల వైపు చేతులెత్తి వారిని దీవించాడు. పాపపరిహారబలి, దహనబలి, సమాధానబలి అర్పించిన తర్వాత బలిపీఠం నుండి దిగివచ్చాడు.
23అప్పుడు మోషే అహరోనులు కలిసి సమావేశ గుడారం లోనికి వెళ్లారు. వారు బయటకు వచ్చినప్పుడు ప్రజలను దీవించారు; యెహోవా మహిమ ప్రజలందరికి కనిపించింది. 24యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి బలపీఠం మీద ఉన్న దహనబలిని క్రొవ్వు భాగాలను కాల్చివేసింది. అది చూసి ప్రజలంతా ఆనందంతో కేకలువేస్తూ సాగిలపడ్డారు.

Currently Selected:

లేవీయ 9: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in