YouVersion Logo
Search Icon

లేవీయ 16

16
ప్రాయశ్చిత్త దినం
1అహరోను ఇద్దరు కుమారులు అనధికార నిప్పుతో యెహోవాను సమీపించినప్పుడు వారు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడారు. 2యెహోవా మోషేతో అన్నారు: “నీ సహోదరుడైన అహరోను మందసం మీద ఉన్న ప్రాయశ్చిత్త మూతకు ఎదురుగా ఉన్న తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడంటే అప్పుడు రావద్దు అని చెప్పు, అలా వస్తే అతడు చస్తాడు. ఎందుకంటే నేను మేఘంలో ఆ ప్రాయశ్చిత్త మూత మీదే మీకు ప్రత్యక్షమవుతాను.
3“అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే విధానం ఇది: మొదట అతడు పాపపరిహారబలిగా ఒక కోడెను, దహనబలి కోసం ఒక పొట్టేలును తేవాలి. 4అతడు సన్నని నార చొక్కా, సన్నని నారలోదుస్తులు వేసుకోవాలి; సన్నని నార నడికట్టు కట్టుకుని, సన్నని నార పాగా పెట్టుకోవాలి. ఇవి పవిత్ర దుస్తులు; అవి వేసుకోక ముందు అతడు నీటితో స్నానం చేయాలి. 5అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపపరిహారబలి కోసం రెండు మేకపోతులను, దహనబలి కోసం ఒక పొట్టేలును తీసుకోవాలి.
6“అహరోను తనకు, తన ఇంటివారికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఎద్దును తన పాపపరిహారబలిగా అర్పించాలి. 7తర్వాత అతడు రెండు మేకపోతులు తీసుకుని సమావేశ గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుట వాటిని సమర్పించాలి. 8అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక.#16:8 హెబ్రీలో ఇది అజాజేలు; హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు; 10, 26 వచనాల్లో కూడా 9అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి. 10విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి.
11“అహరోను పాపపరిహారబలిగా ఒక కోడెదూడను తన కోసం తన ఇంటివారి ప్రాయశ్చిత్తం కోసం తీసుకురావాలి, దానిని తన పాపపరిహారబలిగా వధించాలి. 12అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపిన ధూపార్తిని, రెండు పిడికెళ్ళ పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెర వెనుకకు తీసుకెళ్లాలి. 13అతడు ధూపాన్ని యెహోవా ముందు అగ్ని మీద ఉంచాలి, ధూపం యొక్క పొగ ఒడంబడిక పలకలను కప్పి ఉంచిన ప్రాయశ్చిత్త మూతను కప్పివేస్తుంది, తద్వారా అతడు చనిపోడు. 14ఆ కోడె రక్తంలో కొంత తన వ్రేలితో తీసుకుని ప్రాయశ్చిత్త మూత ముందు చల్లాలి; తర్వాత దానిలో కొంత రక్తం వ్రేలితో ఏడుసార్లు ప్రాయశ్చిత్త మూత ఎదుట ప్రోక్షించాలి.
15“తర్వాత అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకపోతును వధించాలి, దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తెచ్చి కోడె రక్తాన్ని చేసినట్టు ప్రాయశ్చిత్త మూత మీద, దాని ముందు చిలకరించాలి. 16ఇశ్రాయేలీయుల అపవిత్రత కోసం, తిరుగుబాటు కోసం, వారి పాపాలన్నిటి కోసం అతడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఇశ్రాయేలీయుల అపవిత్రత మధ్య వారి మధ్యలో ఉన్న సమావేశ గుడారం కోసం కూడా ఇదే రీతిలో ప్రాయశ్చిత్తం చేయాలి. 17అతి పరిశుద్ధస్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి అహరోను లోపలికి వెళ్లినప్పుడు, తన కోసం తన ఇంటివారి కోసం ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బయటకు వచ్చేవరకు ఏ మనుష్యుడు#16:17 హెబ్రీలో ఆదాము అని వ్రాయబడింది సమావేశ గుడారంలో ఉండకూడదు.
18“తర్వాత అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వచ్చి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు కోడె రక్తం కొంచెం, మేకపోతు రక్తం కొంచెం తీసుకుని బలిపీఠం కొమ్ములన్నిటికి పూయాలి. 19దానిని శుద్ధీకరించడానికి అతడు తన వ్రేలితో ఆ రక్తాన్ని దానిపై ఏడుసార్లు చల్లి ఇశ్రాయేలీయుల అపవిత్రత నుండి దానిని పవిత్రపరచాలి.
20“అహరోను అతి పరిశుద్ధ స్థలానికి సమావేశ గుడారానికి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత, అతడు సజీవ మేకపోతును తీసుకురావాలి. 21ఆ మేకపోతు తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల దుష్టత్వమంతటిని, తిరుగుబాటును, పాపాలన్నిటిని దానిపై ఒప్పుకుని వాటిని మేకపోతు తలపై మోపాలి. ఈ పనికి నియమించబడిన వ్యక్తి ఆ మేకపోతును తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టాలి. 22ఆ మేకపోతు ఈ విధంగా వారి పాపాలన్నిటిని భరిస్తూ నిర్జన ప్రదేశాలకు వెళ్తుంది; ఆ వ్యక్తి దానిని అరణ్యంలో వదిలేస్తాడు.
23“అప్పుడు అహరోను సమావేశ గుడారంలోకి వెళ్లి అతి పరిశుద్ధస్థలంలోకి వెళ్లేముందు తాను వేసుకున్న సన్నని నార వస్త్రాలను విప్పివేయాలి. 24అతడు పరిశుద్ధాలయ ప్రాంగణంలో నీటితో స్నానం చేసి తన సాధారణ బట్టలు వేసుకోవాలి. బయటకు వచ్చి తన కోసం దహనబలిని, ప్రజల పక్షాన మరో దహనబలిని అర్పించి తన కోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. 25అతడు పాపపరిహారబలి యొక్క క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాలి.
26“బలిపశువైన మేకను విడిచిపెట్టి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసిన తర్వాత అతడు శిబిరంలోకి రావచ్చు. 27ప్రాయశ్చిత్తం కోసం అతి పరిశుద్ధస్థలంలోకి వేటి రక్తాన్నైతే తీసుకువచ్చారో ఆ పాపపరిహార బలులైన కోడెదూడను, మేకపోతును శిబిరం బయటకు తీసుకెళ్ళాలి; వాటి చర్మాలను, మాంసాన్ని, పేడను కాల్చివేయాలి. 28వాటిని కాల్చే వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.
29“నెల పదవ రోజున మీరంతా ఉపవాసముండాలి. స్వదేశీయులు గాని, మీ ఇంట్లో ఉన్నా విదేశీయులు గాని ఎవరైనా సరే ఈ నియమం అందరికి వర్తిస్తుంది. ఆ రోజున ఎవరూ ఏ పని చేయకూడదు. 30ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని పవిత్రపరచడానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అప్పుడు యెహోవా ఎదుట, మీ పాపాలన్నిటి నుండి మీరు శుద్ధి చేయబడతారు. 31ఆ రోజు మీకు సబ్బాతు విశ్రాంతి దినము. అప్పుడు మీరు ఉపవాసముండాలి; ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది. 32ఎవరైతే తన తండ్రి స్థానంలో అభిషేకం పొంది ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడతారో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం జరిగించాలి. అతడు పవిత్రమైన నార వస్త్రాలు ధరించి, 33అతి పరిశుద్ధ స్థలానికి, సమావేశ గుడారానికి బలిపీఠానికి, యాజకులకు, సమాజంలోని సభ్యులందరికి ప్రాయశ్చిత్తం చేయాలి.
34“ఇది మీ కోసం నిత్య కట్టుబాటుగా ఉంటుంది: ఇశ్రాయేలీయుల పాపాలన్నిటికీ సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయాలి.”
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే, అంతా జరిగింది.

Currently Selected:

లేవీయ 16: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in