లేవీయ 15
15
స్రావాలు అపవిత్రతను కలిగించుట
1యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, 2“మీరు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పండి: ‘ఎప్పుడైనా ఏ పురుషునికైనా శరీరంలో నుండి ఏదైనా ద్రవం కారుతుంటే అది అపవిత్రమైనది. 3అది అతని శరీరం నుండి కారుతూ ఉన్నా లేక ఆగిపోయినా అది అతన్ని అపవిత్రం చేస్తుంది. ఈ విధంగా కారడం వలన అతడు అపవిత్రుడు అవుతాడు.
4“ ‘స్రవిస్తున్న వ్యక్తి ఏ పడక మీద పడుకున్నా అది అపవిత్రమవుతుంది, అతడు దేనిపైనా కూర్చున్న అది అపవిత్రమవుతుంది. 5అతని పడకను తాకినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు. 6స్రవిస్తున్న వ్యక్తి కూర్చున్న దానిపైన ఎవరు కూర్చున్నా వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
7“ ‘స్రవిస్తున్న వ్యక్తిని ఎవరు తాకినవారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
8“ ‘స్రవిస్తున్న వ్యక్తి శుభ్రంగా ఉన్నవారిపై ఉమ్మివేస్తే, వారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
9“ ‘స్వారీ చేసేటప్పుడు ఆ వ్యక్తి కూర్చున్నది అపవిత్రమవుతుంది. 10అతని క్రింద ఉన్న ఏ వస్తువునైనా తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు; ఆ వస్తువులను పైకెత్తినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
11“ ‘స్రవిస్తున్న వ్యక్తి నీటితో చేతులు కడుక్కోకుండా ఎవరినైన తాకితే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
12“ ‘ఆ వ్యక్తి తాకిన మట్టికుండను ఖచ్చితంగా పగులగొట్టాలి, అది చెక్క వస్తువైతే దానిని నీటితో కడగాలి.
13“ ‘స్రవిస్తున్న వ్యక్తి తన స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, అతడు తన శుద్ధీకరణ కోసం ఏడు రోజులు లెక్కించి తన బట్టలు ఉతుక్కోవాలి, మంచి నీటితో స్నానం చేయాలి, అప్పుడు అతడు పవిత్రంగా అవుతాడు. 14ఎనిమిదవ రోజున అతడు రెండు పావురాలను లేదా రెండు చిన్న గువ్వలను తీసుకుని యెహోవా ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి. 15యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్రవిస్తున్న వ్యక్తికి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
16“ ‘ఒక వ్యక్తికి వీర్యస్కలనం జరిగితే అతడు నీటితో పూర్తిగా స్నానం చేయాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు. 17బట్టలమీద గాని లేదా చర్మం మీద గాని వీర్యం పడివుంటే నీటితో వాటిని కడగాలి, అవి సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాయి. 18ఒక పురుషుడు స్త్రీ తో లైంగికంగా కలిసినప్పుడు వీర్యస్కలనం జరిగితే ఇద్దరూ నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
19“ ‘ఒక స్త్రీకి నెలసరి సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు ఆమె నెలసరి అపవిత్రత ఏడు రోజులు ఉంటుంది, ఆమెను తాకిన వారెవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
20“ ‘నెలసరి సమయంలో ఆమె దేనిపై పడుకుంటుందో అది అపవిత్రం అవుతుంది, ఆమె దేనిపై కూర్చుంటుందో అది అపవిత్రం అవుతుంది. 21ఆమె పడకను తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు. 22ఆమె కూర్చున్న దాన్ని తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు. 23ఆమె పడకను గాని ఆమె కూర్చున్న దానిని గాని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
24“ ‘ఒక వ్యక్తి ఆమెతో లైంగికంగా కలిసినప్పుడు ఆమె నెలసరి అతన్ని తాకితే, అతడు ఏడు రోజులు అపవిత్రునిగా ఉంటాడు; అతడు పడుకున్న ఏ పడకయైనా అపవిత్రమవుతుంది.
25“ ‘ఒక స్త్రీకి తన నెలసరి సమయం కాకుండా చాలా రోజులు రక్తస్రావం జరిగినా లేదా ఆమె నెలసరి వ్యవధి మించి రక్తస్రావం కొనసాగితే, రక్తస్రావం ఉన్నంత వరకు నెలసరి రోజుల్లా ఆమె అపవిత్రంగా ఉంటుంది. 26ఆమెకు రక్తస్రావం కొనసాగుతున్నప్పుడు ఆమె పడుకున్న ఏ పడకైనా ఆమె నెలసరి సమయంలో ఉన్నప్పటిలాగే ఆ పడక అపవిత్రం, అలాగే ఆమె దేనిపై కూర్చున్న అది అపవిత్రం అవుతుంది. 27వాటిని తాకినవారు అపవిత్రులు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
28“ ‘ఆమె స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, ఆమె ఏడు రోజులు లెక్కించి అవి ముగిసిన తర్వాత ఆమె పవిత్రమవుతుంది. 29ఎనిమిదవ రోజున ఆమె రెండు గువ్వలను గాని, రెండు పావురం పిల్లలను గాని తీసుకువచ్చి సమావేశ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి. 30యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్త్రీకి స్రావం ద్వార కలిగిన అపవిత్రతకు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
31“ ‘తమను అపవిత్రం చేసే వాటినుండి మీరు ఇశ్రాయేలీయులను దూరంగా ఉంచాలి, తద్వార వారి మధ్య ఉన్న నా నివాస స్థలాన్ని#15:31 లేదా నా సమావేశ గుడారాన్ని వారు అపవిత్రం చేసినందుకు వారి అపవిత్రతలో వారు చావరు.’ ”
32ఈ నియమాలు స్రవిస్తున్న వ్యక్తికి వీర్యస్కలనం వలన అపవిత్రమైన వారికి ఈ నియమాలు వర్తిస్తాయి. 33తన నెలసరి సమయంలో ఉన్న ఒక స్త్రీకి, స్రవిస్తున్న పురుషునికి గాని స్త్రీకి గాని, అపవిత్రురాలైన స్త్రీతో లైంగికంగా కలిసిన పురుషునికి వర్తిస్తాయి.
Currently Selected:
లేవీయ 15: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.