లేవీయ 14
14
చర్మ వ్యాధుల నుండి శుద్ధీకరణ
1యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“ఎవరైనా అనారోగ్య వ్యక్తిని వారి ఆచారరీత్య శుద్ధీకరణ పాటిస్తున్న సమయంలో, యాజకుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి: 3యాజకుడు శిబిరం బయటకు వెళ్లి వారిని పరీక్షించాలి. ఒకవేళ వారు వారి అపవిత్ర చర్మ వ్యాధి#14:3 హెబ్రీలో అపవిత్ర చర్మ వ్యాధి, శాస్త్రీయంగా “కుష్ఠురోగం,” చర్మం మీద ప్రభావం చూపుతుంది; 7, 32, 54, 57వచనాల్లో కూడా ఉంది. నుండి స్వస్థత పొందివుంటే, 4వారిని శుద్ధీకరించడానికి రెండు బ్రతికి ఉన్న పవిత్రమైన పక్షులు, కొంత దేవదారు కలప, ఎరుపురంగు నూలు, హిస్సోపును తీసుకురావాలని యాజకుడు ఆదేశించాలి. 5తర్వాత ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపుమని యాజకుడు ఆదేశించాలి. 6అప్పుడు యాజకుడు బ్రతికి ఉన్న పక్షిని పట్టుకుని, దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకుని మంచినీటిపై చంపబడిన పక్షి రక్తంలో ముంచాలి. 7కుష్ఠువ్యాధి నుండి శుద్ధీకరణ పొందే వారిపై ఆ నీటిని ఏడుసార్లు చల్లి, అతడు ఏడుసార్లు చల్లి, వారిని పవిత్రులుగా ప్రకటించాలి. ఆ తర్వాత, యాజకుడు బ్రతికి ఉన్న మరొక పక్షిని బయట పొలాల్లోకి వదిలేయాలి.
8“శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి. 9ఏడవ రోజున వారు తమ వెంట్రుకలంతా క్షవరం చేయించుకోవాలి; గడ్డం, కనుబొమ్మలు ఇంకా మిగతా వెంట్రుకలు పూర్తిగా క్షవరం చేసుకోవాలి. అలాగే వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.
10“ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల#14:10 అంటే సుమారు 5 కి. గ్రా. లు నాణ్యమైన పిండి, ఒక సేరు#14:10 అంటే సుమారు 0.3 లీటర్; 12, 15, 21, 24వచనాల్లో కూడా నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి. 11వారిని శుద్ధులుగా ప్రకటించే యాజకుడు శుద్ధీకరించబడిన వారిని, వారి అర్పణలతో పాటు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా ఎదుట కనుపరచాలి.
12“అప్పుడు యాజకుడు మగ గొర్రెపిల్లలలో ఒకదాన్ని తీసుకుని, అపరాధపరిహారబలిగా, కొంచెం నూనెతో పాటు అర్పించాలి; అతడు వాటిని పైకెత్తి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాలి. 13అతడు పాపపరిహారబలిని, దహనబలిని వధించే పరిశుద్ధాలయ ప్రాంతంలో గొర్రెపిల్లను వధించాలి. పాపపరిహారబలిలా, అపరాధపరిహారబలి కూడా యాజకునికే చెందుతుంది; అది అతిపరిశుద్ధము. 14యాజకుడు అపరాధపరిహారబలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి యొక్క కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి. 15అప్పుడు యాజకుడు కొంచెం నూనె తీసుకుని, తన ఎడమచేతి అరచేతిలో పోసి, 16తన కుడి చూపుడు వ్రేలు తన అరచేతిలో ఉన్న నూనెలో ముంచి, తన వ్రేలితో దానిలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరిస్తాడు. 17యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెలో కొంచెం శుద్ధి చేయబడవలసిన వ్యక్తి యొక్క కుడిచెవి యొక్క లోలాకుల మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడి పాదం యొక్క పెద్ద బొటనవ్రేలుపై, అపరాధపరిహారబలి పశువు రక్తం పైన ఉంచాలి. 18యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెను శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలమీద పూసి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
19“అప్పుడు యాజకుడు అపవిత్రత పోగొట్టుకోవాలని వచ్చిన వారి కోసం పాపపరిహారబలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దహనబలి పశువును వధించాలి. 20దానిని భోజనార్పణతో కలిపి బలిపీఠం మీద అర్పించి, వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి, అప్పుడు వారు శుద్ధులవుతారు.
21“అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు#14:21 అంటే సుమారు 1.6 కి. గ్రా. లు నాణ్యమైన పిండిని, 22రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను, వారి స్థోమతను బట్టి ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసం తీసుకురావాలి.
23“ఎనిమిదవ రోజున వారు తమ శుద్ధీకరణ కోసం యెహోవా ఎదుటికి సమావేశ గుడారపు ద్వారం దగ్గర యాజకుని దగ్గరకి వాటిని తీసుకురావాలి. 24యాజకుడు అపరాధపరిహారబలిగా అర్పించేందుకు గొర్రెపిల్లతో పాటు కొంచెం నూనె కూడా తీసుకుని పైకెత్తి ప్రత్యేక అర్పణగా యెహోవా ఎదుట అర్పించాలి. 25అతడు అపరాధపరిహారబలిగా గొర్రెపిల్లను వధించి, దాని రక్తంలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి. 26యాజకుడు కొంచెం నూనె తన ఎడమ అరచేతిలో వేసుకుని, 27తన కుడి చూపుడు వ్రేలును దానిలో ముంచి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి. 28తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై ఉన్న అపరాధ బలి పశువు రక్తం మీద ఉంచాలి. 29యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలకు పూసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. 30అప్పుడు వారు తమ స్థోమతను బట్టి తీసుకువచ్చిన గువ్వలను పావురం పిల్లలను యాజకుడు తీసుకుని, 31పాపపరిహారబలిగా ఒకదాన్ని, దహనబలిగా ఒకదాన్ని సమర్పించాలి. వాటిని భోజనార్పణతో పాటు అర్పించాలి. ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”
32తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉండి తమ శుద్ధీకరణకు తీసుకురావలసిన అర్పణలను తీసుకురావడానికి స్థోమతలేని వారికి సంబంధించిన నియమాలు ఇవి.
అపవిత్ర మరకల నుండి శుద్ధీకరణ
33యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, 34“మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే, 35వెంటనే ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరకు వెళ్లి, ‘నేను నా ఇంట్లో అపవిత్రమైన మచ్చ చూశాను’ అని చెప్పాలి. 36ఆ ఇంట్లో ఉన్నదంతా అపవిత్రంగా కాకుండ ఉండడానికి యాజకుడు ఆ మచ్చను పరీక్షించడానికి రాకముందే ఆ ఇళ్ళంతా ఖాళీ చేయించాలి. ఆ తర్వాత యాజకుడు లోపలికి వెళ్లి ఇంటిని పరీక్షించాలి. 37అతడు గోడలపై ఉన్న మచ్చను పరీక్షించినప్పుడు ఆ గోడల మీద పచ్చని గీతలు గాని ఎర్రని గీతలు గోడ పగుళ్లలో ఉంటే, 38యాజకుడు ఆ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లి ఏడు రోజులు దానిని మూసివేయాలి. 39ఏడవ రోజున యాజకుడు ఆ ఇంటిని పరిశీలించడానికి మరలా రావాలి. ఒకవేళ గోడలపై మరక వ్యాపించి ఉంటే, 40మచ్చలు ఉన్న ఆ రాళ్లను ఊడదీసి పట్టణానికి బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయమని యాజకుడు ఆదేశించాలి. 41అతడు ఇంటి లోపలి గోడలన్నింటిని గీయించి ఆ చెత్తను పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి. 42తీసివేసిన వాటి స్థానంలో వేరే రాళ్లు పెట్టి క్రొత్త బంకమట్టిని తీసుకుని ఇంటికి అడుసు పూయాలి.
43“రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే, 44యాజకుడు వెళ్లి దానిని పరీక్షించాలి, ఒకవేళ ఇంట్లో మరక వ్యాపించి ఉంటే అది అపవిత్రపరచే మరక; ఆ ఇల్లు అపవిత్రమైనది. 45ఆ ఇంటిని దాని రాళ్లను కలపను అడుసును కూలగొట్టి వాటిని పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
46“ఒకవేళ ఇల్లు మూసివేసి ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు. 47ఆ ఇంట్లో పడుకునేవారు తినేవారు ఎవరైనా సరే తమ బట్టలు ఉతుక్కోవాలి.
48“యాజకుడు వచ్చి దానిని పరీక్షించినప్పుడు ఆ ఇంటికి అడుసు పూసిన తర్వాత మరక వ్యాపించకపోతే, అపవిత్రం చేసే మరక పోయింది కాబట్టి ఆ ఇల్లు పవిత్రమని అతడు ప్రకటించాలి. 49ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులను కొంచెం దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకోవాలి. 50అతడు ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపాలి. 51అప్పుడు అతడు దేవదారు కర్రను హిస్సోపును ఎర్రని నూలును బ్రతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోను మంచినీటిలోను ముంచి ఆ ఇంట్లో ఏడుసార్లు చల్లాలి. 52అతడు ఇంటిని పక్షి రక్తంతోను మంచినీటితోను బ్రతికి ఉన్న పక్షితో దేవదారు కర్రతో హిస్సోపుతో ఎర్రని నూలుతో శుద్ధి చేయాలి. 53అప్పుడు అతడు బ్రతికి ఉన్న పక్షిని పట్టణం బయట ఉన్న పొలాల్లో వదలివేయాలి. ఈ విధంగా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయాలి, అది శుద్ధి అవుతుంది.”
54ఏదైనా కుష్ఠువ్యాధికైనా గజ్జిపుండ్లకైనా నియమాలు ఇవి, 55వస్త్రాల్లో గాని ఇంట్లో గాని ఏర్పడే అపవిత్రపరచే మరకలకు, 56వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా, 57అవి పవిత్రమైనవా అపవిత్రమైనవా అని ఈ నిబంధనలు తెలియజేస్తాయి.
కుష్ఠువ్యాధులు, అపవిత్రపరచే మరకలకు సంబంధించిన నియమాలు ఇవే.
Currently Selected:
లేవీయ 14: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.