YouVersion Logo
Search Icon

యెహోషువ 3

3
యొర్దాను నదిని దాటుట
1ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు. 2మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, 3ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి. 4మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల#3:4 అంటే సుమారు 900 మీటర్లు దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.”
5యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు.
6యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు.
7యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను. 8నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.”
9యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, “ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి. 10ఈ విధంగా సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నారని, ఆయన కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ముందు నుండి వెళ్లగొడతారని మీరు తెలుసుకుంటారు. 11చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది. 12ఇప్పుడు, ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రతి గోత్రం నుండి ఒక పురుషుని చొప్పున పన్నెండుమందిని ఎన్నుకోండి. 13లోకమంతటికి ప్రభువైన యెహోవా మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యొర్దానులో అడుగు పెట్టగానే, దిగువకు ప్రవహిస్తున్న ప్రవాహం తెగిపోయి ఒకవైపు రాశిగా నిలబడతాయి.”
14కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు. 15కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. 16ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు. 17ఇశ్రాయేలీయులంతా పొడినేల మీద యొర్దాను నది దాటే వరకు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో పొడినేల మీద నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా పొడినేల మీద యొర్దాను నదిని దాటారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in