యిర్మీయా 36
36
యిర్మీయా గ్రంథపుచుట్టను యెహోయాకీము కాల్చివేయుట
1యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో నాలుగో సంవత్సరంలో, యిర్మీయాకు యెహోవా నుండి ఈ మాట వచ్చింది: 2“ఒక గ్రంథపుచుట్ట తీసుకుని యూదా, ఇశ్రాయేలు, ఇతర జనాంగాల గురించి యోషీయా పాలనలో నీతో మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ దానిలో వ్రాయి. 3బహుశా యూదా ప్రజలు నేను వారికి రప్పించాలని అనుకున్న ప్రతి విపత్తు గురించి విన్నప్పుడు వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో; అప్పుడు నేను వారి దుర్మార్గాన్ని, వారి పాపాన్ని క్షమిస్తాను.”
4కాబట్టి యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలిచి, యెహోవా తనతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా చెప్తుండగా, బారూకు వాటిని గ్రంథపుచుట్ట మీద వ్రాశాడు. 5అప్పుడు యిర్మీయా బారూకుతో, “నేను నిర్బంధించబడ్డాను; కాబట్టి యెహోవా ఆలయానికి వెళ్లడానికి నాకు అనుమతి లేదు. 6కాబట్టి ఉపవాస దినాన నీవు యెహోవా ఆలయానికి వెళ్లి, నేను చెప్పినట్లుగా నీవు గ్రంథపుచుట్టలో వ్రాసిన యెహోవా వాక్కులను ప్రజలకు చదివి వినిపించు. తమ పట్టణాల నుండి వచ్చే యూదా ప్రజలందరికి వాటిని చదివి వినిపించు. 7బహుశా వారి విన్నపం యెహోవా సన్నిధిలో ఆమోదించబడి, వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో, ఎందుకంటే యెహోవా ఈ ప్రజల మీదకు తీవ్రమైన కోపం ఉగ్రత వస్తాయని ప్రకటించారు.”
8నేరియా కుమారుడైన బారూకు యిర్మీయా ప్రవక్త చెప్పినదంతా చేశాడు; యెహోవా మందిరంలో అతడు గ్రంథపుచుట్టలోని యెహోవా మాటలను చదివి వినిపించాడు. 9యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో అయిదవ సంవత్సరం తొమ్మిదవ నెలలో, యెరూషలేములోని ప్రజలందరికి, యూదా పట్టణాల నుండి వచ్చిన ప్రజలందరికి యెహోవా సన్నిధిలో ఉపవాసం ఉండాలని ప్రకటించబడింది. 10యెహోవా మందిరంలో కార్యదర్శియైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో యెహోవా మందిర క్రొత్త ద్వార ప్రవేశం దగ్గర ప్రజలందరికి వినిపించేలా బారూకు గ్రంథపుచుట్టలో నుండి యిర్మీయా చెప్పిన మాటలను చదివాడు.
11షాఫాను మనుమడును గెమర్యా కుమారుడునైన మీకాయా ఆ గ్రంథపుచుట్టలో నుండి చదవబడిన యెహోవా చెప్పిన మాటలన్నీ విని, 12అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు. 13బారూకు ఆ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించిన ప్రతిదీ మీకాయా వారికి చెప్పిన తర్వాత, 14“నీవు ఏ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించావో దాన్ని తీసుకుని రా” అని బారూకుకు చెప్పడానికి అధికారులందరు కలిసి కూషీ కుమారుడైన షెలెమ్యా, అతని కుమారుడైన నెతన్యా, అతని కుమారుడైన యెహూదిని పంపారు. కాబట్టి నేరియా కుమారుడైన బారూకు ఆ గ్రంథపుచుట్టను తీసుకుని వారి దగ్గరకు వెళ్లాడు. 15వారు అతనితో, “దయచేసి కూర్చుని, మాకు దాన్ని చదివి వినిపించండి” అని అడిగారు.
కాబట్టి బారూకు దానిని వారికి చదివి వినిపించాడు. 16వారు ఈ మాటలు విని భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని బారూకుతో, “ఈ మాటలన్నీ మనం తప్పక రాజుకు తెలియజేయాలి” అని అన్నారు. 17అప్పుడు వారు బారూకును, “నీవు ఇవన్నీ ఎలా వ్రాశావు? యిర్మీయా చెప్పాడా? మాకు చెప్పు” అని అడిగారు.
18అందుకు బారూకు, “అవును, ఇవన్నీ అతడు చెప్తుండగా, నేను ఈ గ్రంథపుచుట్టలో వ్రాశాను” అని జవాబిచ్చాడు.
19అప్పుడు అధికారులు బారూకుతో, “నీవు, అలాగే యిర్మీయా కూడా వెళ్లి దాక్కోండి. మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకూడదు” అని చెప్పారు.
20తర్వాత వారు ఆ గ్రంథపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో పెట్టి, తన భవన ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, జరిగినదంతా ఆయనతో చెప్పారు. 21అప్పుడు రాజు ఆ గ్రంథపుచుట్టను తెమ్మని యెహూదిని పంపినప్పుడు, అతడు వెళ్లి లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తెచ్చి రాజుకు, ఆయన ప్రక్కన నిలబడి ఉండిన అధికారులందరికి చదివి వినిపించాడు. 22అది తొమ్మిదవ నెల కాబట్టి రాజు శీతాకాలపు భవనంలో మంటలు మండుతున్న కుంపటి ముందు కూర్చుని ఉన్నాడు. 23యెహూది గ్రంథపుచుట్టలోని మూడు నాలుగు వరుసలను చదివినప్పుడల్లా, రాజు వాటిని లేఖికుని కత్తితో కోసి మండుతున్న కుంపటిలో విసురుతూ ఉన్నాడు, ఆ గ్రంథపుచుట్టను పూర్తిగా కాల్చివేసే వరకు రాజు అలాగే చేశాడు. 24ఈ మాటలన్నీ విన్న రాజు గాని అతని సహాయకులెవ్వరు గాని భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. 25ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు. 26పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.
27యిర్మీయా చెప్తూ ఉండగా బారూకు వ్రాసిన ఆ గ్రంథపుచుట్టను రాజు కాల్చివేసినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది: 28“మరో గ్రంథపుచుట్టను తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చివేసిన మొదటి గ్రంథపుచుట్టలో ఉండిన మాటలన్నీ దానిపై వ్రాయి. 29అలాగే యూదా రాజైన యెహోయాకీముతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ఆ గ్రంథపుచుట్టను కాల్చివేసి, “బబులోను రాజు ఖచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తాడని దాని నుండి మనుష్యులను, జంతువులను తుడిచివేస్తాడని నీవు దానిపై ఎందుకు వ్రాశావు?” అని అన్నావు. 30కాబట్టి యూదా రాజైన యెహోయాకీమును గురించిన యెహోవా వాక్కు ఇదే: దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీకు ఎవరూ ఉండరు, అతని శవం పగలు ఎండలో రాత్రి మంచులో పడి ఉంటుంది. 31నేను అతన్ని, అతని పిల్లలను అతని సేవకులను వారి దుర్మార్గాన్ని బట్టి శిక్షిస్తాను; నేను వారి మీదికి, యెరూషలేములో నివసించేవారి మీదికి, యూదా ప్రజలమీదికి నేను వారికి వ్యతిరేకంగా ప్రకటించిన ప్రతీ విపత్తును రప్పిస్తాను, ఎందుకంటే వారు నా మాట వినలేదు.’ ”
32కాబట్టి యిర్మీయా మరో గ్రంథపుచుట్టను తీసుకుని నేరియా కుమారుడైన బారూకు అనే లేఖికునికి ఇచ్చి, యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపుచుట్టలోని మాటలన్నిటిని యిర్మీయా చెప్తూ ఉండగా, బారూకు దానిపై వ్రాశాడు. ఆ మాటలతో పాటు అలాంటి అనేక మాటలను వ్రాశాడు.
Currently Selected:
యిర్మీయా 36: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.