YouVersion Logo
Search Icon

న్యాయాధిపతులు 8

8
సెబహు సల్మున్నా
1అయితే ఎఫ్రాయిమీయులు, “నీవు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నీవు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలువలేదు?” అని గిద్యోనుతో తీవ్రంగా వాదించారు.
2అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? 3దేవుడు మిద్యానీయుల నాయకులైన ఓరేబు, జెయేబులను మీకు అప్పగించారు. మీతో పోల్చుకుంటే నేనేమి చేయగలిగాను?” అని అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది.
4గిద్యోను, అతనితో ఉన్న మూడువందలమంది అలసిపోయిన కూడా శత్రువులను తరుముతూ యొర్దాను దగ్గరకు వచ్చి, దానిని దాటారు. 5అతడు సుక్కోతు వారితో, “నా సైనికులకు కొంత ఆహారం ఇవ్వండి; వారు అలసిపోయి ఉన్నారు, నేను ఇంకా మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.
6కాని సుక్కోతు అధికారులు, “జెబహు, సల్మున్నా అనే వారిని మీరు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేమెందుకు ఆహారమివ్వాలి?” అన్నారు.
7అందుకు గిద్యోను, “జెబహు సల్మున్నాను యెహోవా మా చేతికి ఇచ్చిన తర్వాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
8అక్కడినుండి అతడు పెనూయేలుకు వెళ్లి వారిని కూడా ఆహారం కోసం అలాగే అడిగినప్పుడు, వారు కూడా సుక్కోతు వారిలా జవాబిచ్చారు, 9కాబట్టి అతడు పెనూయేలు మనుష్యులతో, “నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని చెప్పాడు.
10అప్పుడు జెబహు, సల్మున్నా, ఇంచుమించు పదిహేను వేలమంది బలగంతో, అనగా తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలిన వారితో కర్కోరులో ఉన్నారు; లక్షా ఇరవై వేలమంది సైనికులు అప్పటికే చనిపోయారు. 11అప్పుడు గిద్యోను నోబహుకు, యొగ్బెహకు తూర్పున, గుడారవాసుల మార్గం గుండా వెళ్లి క్షేమంగా ఉన్న శత్రు సైన్యం మీద దాడి చేశాడు. 12ఇద్దరు మిద్యాను రాజులైన జెబహు, సల్మున్నా పారిపోయారు, కాని అతడు వారిని వెంటాడి పట్టుకుని వారి సైన్యమంతటిని ఓడించాడు.
13యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి హెరెసు కనుమ నుండి తిరిగి వచ్చాడు. 14అతడు ఒక సుక్కోతు యువకుడిని పట్టుకుని విచారించగా ఆ యువకుడు సుక్కోతు పెద్దలైన డెబ్బై ఏడు అధిపతుల పేర్లు వ్రాసి ఇచ్చాడు. 15అప్పుడు గిద్యోను సుక్కోతు వారి దగ్గరకు వచ్చి, “నన్ను హేళన చేస్తూ, ‘జెబహు, సల్మున్నాలను నీవు ఇంకా జయించలేదు కదా? నీ అలిసిపోయిన నీ సైన్యానికి మేమెందుకు రొట్టెలివ్వాలి?’ అని మీరు ఎవరి గురించి అన్నారో ఆ సెబహు, సల్మున్నాలు వీరే.” 16ఆ ఊరిపెద్దలను పట్టుకుని ఎడారి ముళ్ళతో, ముళ్ళపొదలతో శిక్షించి సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు. 17అతడు పెనూయేలు గోపురాన్ని కూడా పడగొట్టి ఆ పట్టణస్థులను చంపాడు.
18గిద్యోను, “మీరు తాబోరులో ఎలాంటి మనుష్యులను చంపారు?” అని జెబహును సల్మున్నాను అడిగాడు.
అందుకు వారు, “నీలాంటి వారినే, వారంతా రాజకుమారుల్లా ఉన్నారు” అన్నారు.
19అందుకు గిద్యోను, “వారు నా సోదరులు, నా సొంత తల్లి కుమారులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని చంపేవాడిని కాదు” అన్నాడు. 20అతడు తన పెద్దకుమారుడైన యెతెరును చూసి, “వారిని చంపు!” అన్నాడు కాని యెతెరు చిన్నవాడు కాబట్టి భయపడి తన ఖడ్గాన్ని దూయలేదు.
21అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే చేయు, మనిషిని బట్టి అతని శక్తి ఉంటుంది” అన్నారు. గిద్యోను ముందుకు వెళ్లి వారిని చంపి, వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
గిద్యోను ఏఫోదు
22అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, “నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి మమ్మల్ని నీవు, నీ కుమారుడు, నీ మనుమడు పాలించండి” అన్నారు.
23అయితే గిద్యోను వారితో, “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించడు. యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తారు” అన్నాడు. 24గిద్యోను ఇంకా మాట్లాడుతూ, “నేను చేసే మనవి ఒక్కటే, మీలో ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న ఒక చెవి పోగును నాకు ఇవ్వండి” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు కాబట్టి వారి ఆచారం చెవులకు పోగులు పెట్టుకోవడము.)
25వారు జవాబిస్తూ, “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాం” అన్నారు. కాబట్టి వారు ఒక బట్ట పరచి, ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దానిలో వేశారు. 26మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు ఆభరణాలు ఊదా దుస్తులు వారి ఒంటెల మెడలకున్న గొలుసులు కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల షెకెళ్ళ#8:26 అంటే, 20 కి. గ్రా. లు బంగారం అయ్యింది. 27గిద్యోను ఆ బంగారాన్ని ఏఫోదులా చేసి దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరు అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారం చేశారు. అది గిద్యోనుకు అతని కుటుంబానికి ఉచ్చుగా మారింది.
గిద్యోను మరణం
28మిద్యానీయులను ఇశ్రాయేలీయులు అణచివేసిన తర్వాత వారు మరలా తల ఎత్తలేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
29యోవాషు కుమారుడు గిద్యోను#8:29 హెబ్రీలో యెరుబ్-బయలు మరో పేరు; 6:32చూడండి. తన సొంత ఇంట్లో నివసించడానికి తిరిగి వెళ్లిపోయాడు. 30గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్నారు కాబట్టి అతనికి పుట్టిన కుమారులు డెబ్బైమంది ఉన్నారు. 31షెకెములో ఉన్న తన ఉంపుడుగత్తెకు కూడా ఒక కుమారుడు పుట్టినప్పుడు అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. 32యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు, అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యోవాషు సమాధిలో అతడు పాతిపెట్టబడ్డాడు.
33గిద్యోను చనిపోయిన వెంటనే ఇశ్రాయేలీయులు తిరిగి బయలుతో వ్యభిచారం చేశారు. వారు బయల్-బెరీతును#8:33 బయల్-బెరీతును అంటే బయలుతో ఒప్పందం తమ దేవునిగా చేసుకున్నారు, 34అన్నివైపులా ఉన్న తమ శత్రువులందరి చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. 35వారు యెరుబ్-బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయుల కోసం చేసిన ఉపకారాలన్నీ మరచిపోయి అతని కుటుంబానికి ఇచ్చిన మాటను నమ్మకంగా నెరవేర్చలేదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in