న్యాయాధిపతులు 7
7
మిద్యానీయులను ఓడించిన గిద్యోను
1అప్పుడు యెరుబ్-బయలు, అనగా గిద్యోను, అతని మనుష్యులందరు పెందలకడనే లేచి హరోదు బుగ్గ దగ్గర గుడారాలు వేసుకున్నారు. మిద్యానీయుల శిబిరం లోయలో మోరె కొండ దగ్గర వారికి ఉత్తరాన ఉంది. 2యెహోవా గిద్యోనుతో, “నీతో ఎక్కువ మంది మనుష్యులు ఉన్నారు కాబట్టి నేను మిద్యానును వారి చేతులకు అప్పగించను. ఒకవేళ అప్పగిస్తే వారు, ‘మా బాహుబలమే మమ్మల్ని రక్షించింది’ అని ఇశ్రాయేలీయులు అతిశయిస్తారు. 3కాబట్టి నీవు, ‘ఎవరు భయంతో వణకుతున్నారో, వారు వెంటనే గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవచ్చు అని ప్రకటించు’ ” అని చెప్పారు. అప్పుడు ఇరవైరెండువేలమంది తిరిగి వెళ్లిపోగా పదివేలమంది మిగిలారు.
4మరల యెహోవా గిద్యోనుతో, “మనుష్యులు ఇంకా ఎక్కువే ఉన్నారు. వారిని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లు అక్కడ నీకోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెప్తే అతడు వెళ్లాలి; ఒకవేళ ‘ఇతడు నీతో వెళ్లడు’ అని నేను చెప్తే అతడు వెళ్లకూడదు” అని ఆజ్ఞాపించారు.
5కాబట్టి గిద్యోను మనుష్యులను నీళ్ల దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ యెహోవా అతనితో, “కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికే వారిని త్రాగడానికి మోకాళ్లమీద ఉన్నవారిని వేరు చేయి” అన్నారు. 6వారిలో చేతితో నోటికందించుకొని కుక్కల్లా గతికిన వారు మూడువందలమంది. మిగితా అందరు మోకాళ్లమీద వంగి నీళ్లు త్రాగారు.
7అప్పుడు యెహోవా గిద్యోనుతో, “గతికిన మూడువందల మనుష్యులతో నేను మిమ్మల్ని రక్షించి, మిద్యానీయులను మీ చేతులకు అప్పగిస్తాను. మిగిలినవారం తిరిగి వెళ్లిపోవాలి” అని ఆజ్ఞాపించారు. 8కాబట్టి గిద్యోను మిగితా ఇశ్రాయేలీయులను ఇంటికి పంపించాడు, అయితే మూడువందలమంది మనుష్యులు ఆహారాన్ని, బూరలను పట్టుకున్నారు.
మిద్యాను దండు అతనికి క్రింద లోయలో దిగారు. 9ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో, “నీవు లేచి మిద్యాను దండుపై దాడి చేయి, నేను నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను. 10ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు, 11వారు ఏం చెప్పుకుంటున్నారో విను. తర్వాత దండుపై దాడి చేయడానికి నీకు ధైర్యం వస్తుంది” అన్నారు. కాబట్టి అతడు, అతని పనివాడైన పూరా ఆ పాళెంలో ఉన్న స్థావరాల దగ్గరకు వెళ్లారు 12మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పు జనాంగాలు లెక్కకు మిడతలవలె లోయలో విడిది చేశారు. వారి ఒంటెలు సముద్రతీరంలో ఇసుక రేణువుల్లా లెక్కించలేనంత ఉన్నాయి.
13గిద్యోను వచ్చినప్పుడు ఒక వ్యక్తి తాను కనిన కలను తన స్నేహితునికి చెబుతూ, “నాకు ఒక కల వచ్చింది. గుండ్రని యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటు వెళ్లి బలంగా గుడారానికి తగలగానే గుడారం తలక్రిందులై కూలిపోయింది” అని అన్నాడు.
14అతని స్నేహితుడు జవాబిస్తూ, “అది ఇశ్రాయేలీయుడైనా యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని ఇంకొకటి కాదు. దేవుడు మిద్యానీయుల దండు అంతటిని అతని చేతులకు అప్పగించారు” అన్నాడు.
15గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని తలవంచి నమస్కరించి ఇశ్రాయేలు దండు దగ్గరకు తిరిగివెళ్లి, “లేవండి, యెహోవా మిద్యానీయుల సైన్యాన్ని మీకు అప్పగించారు” అని చెప్పాడు. 16ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు.
17గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి. 18నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.”
19నడి జాము వేళ#7:19 అంటే, మధ్యరాత్రి తర్వాత మొదటి జాము కావలివారు మారే సమయంలో గిద్యోను, అతనితో ఉన్న వందమంది దండును సమీపించారు. వారు బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులగొట్టారు. 20ఆ మూడు గుంపులవారు కూడా తమ బూరలను ఊది కుండలను పగులగొట్టారు. వారి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో బూరలను పట్టుకుని, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు. 21దండు చుట్టూ ప్రతి మనుష్యుడు తన స్థానంలో ఉండగా మిద్యాను సైన్యం కేకలువేస్తూ పారిపోయింది.
22మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు. 23నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు. 24గిద్యోను ఎఫ్రాయిం కొండసీమ దేశమంతటికి దూతలను పంపి, “క్రిందికి రండి, మిద్యానీయులను జయించడానికి వచ్చి బేత్-బారా వరకు యొర్దాను నీళ్లను వారికి ముందున్న స్వాధీనపరచుకోండి” అని చెప్పాడు.
కాబట్టి ఎఫ్రాయిం గోత్రికులందరు వచ్చి యొర్దాను నీళ్లను బేత్-బారా వరకు స్వాధీనపరచుకున్నారు. 25వారు మిద్యాను నాయకుల్లో ఓరేబు, జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపారు, జెయేబు ద్రాక్షతోట దగ్గర జెయేబును చంపారు. వారు మిద్యానీయులను వెంటాడి, యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరకు ఓరేబు, జెయేబు తలలను తెచ్చారు.
Currently Selected:
న్యాయాధిపతులు 7: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.