YouVersion Logo
Search Icon

యాకోబు పత్రిక 5

5
హింసించే ధనవంతులకు హెచ్చరిక
1ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. 2మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. 3మీ బంగారము వెండి తుప్పుపడతాయి; వాటి తుప్పు మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉండి అగ్నిలా మీ శరీరాన్ని తింటుంది. మీరు చివరిరోజుల కోసం ధనాన్ని కూడబెట్టారు. 4చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి. 5మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన#5:5 లేదా విందు దినాన మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. 6మిమ్మల్ని ఎదిరించలేని నీతిమంతులను మీరు శిక్షించి వారిని హత్య చేశారు.
శ్రమలలో ఓర్పు
7కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమి నుండి విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు. 8మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి. 9సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు!
10సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. 11సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు. చివరకు ప్రభువు అతనికి చేసిన దాన్ని చూసి ప్రభువు ఎంతో జాలి దయ గలవారని మీరు తెలుసుకున్నారు.
12అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే “అవును” కాదంటే “కాదు” అని లేకపోతే మీరు శిక్షించబడతారు.
విశ్వాసంతో ప్రార్థన
13మీలో ఎవరైనా శ్రమలు అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి. 14మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దలు ప్రభువు పేరిట వారికి నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలి. 15విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగులను బాగుచేస్తుంది. ప్రభువు వారిని లేపుతారు; ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి. 16కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.
17ఏలీయా మనవంటి మనుష్యుడే; కాని అతడు వర్షం పడకూడదని మనఃపూర్వకంగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమిపై వర్షం పడలేదు. 18అతడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి తన పంటను ఇచ్చింది.
19నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోతే ఎవరో ఒకరు వారిని తిరిగి వెనుకకు తీసుకువస్తే, 20తప్పిపోయిన ఆ ఒక్క పాపిని తిరిగి వెనుకకు తీసుకువచ్చినవారు ఆ పాపి ఆత్మను మరణం నుండి రక్షించారని, అనేక పాపాలు కప్పివేయబడ్డాయని మీరు తెలుసుకోండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in