YouVersion Logo
Search Icon

యాకోబు పత్రిక 4

4
మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి
1మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా? 2మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు. 3మీరు అడిగినప్పుడు మీ సంతోషాల కోసం ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు ఏమి దొరకదు.
4వ్యభిచారులారా!#4:4 అవిశ్వాస ఒడంబడికకు సూచన, హోషేయ 3:1 ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు. 5లేదా, “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?#4:5 లేదా ఆయన మనలో నివసింపచేసిన ఆత్మ తీవ్రంగా అసూయపడుచున్నాడు. 6అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి,
“దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని,
దీనులకు దయ చూపిస్తారు”#4:6 సామెత 3:34
అని లేఖనం చెప్తుంది.
7కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. 8దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. 9విచారపడుతూ దుఃఖిస్తూ కన్నీరు కార్చండి. మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి. 10ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
11నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము. 12ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు?
రేపటి గురించి గొప్పలు చెప్పుకోవడం
13“ఈ రోజైనా లేక రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అని చెప్పేవారలారా రండి. 14రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది. 15కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. 16కాని మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది. 17కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in