YouVersion Logo
Search Icon

యాకోబు పత్రిక 2

2
పక్షపాతం చూపకూడదు
1నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి. 2బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు, 3విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి, “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” అని “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, 4మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా?
5నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా? 6అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కాదా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వారు కాదా? 7మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా?
8“మీలా మీ పొరుగువారిని ప్రేమించాలి”#2:8 లేవీ 19:18 అని లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీ ప్రవర్తన సరిగా ఉన్నట్లే. 9అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు. 10ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి వారు అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతారు. 11“వ్యభిచారం చేయకూడదు,”#2:11 నిర్గమ 20:14; ద్వితీ 5:18 అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు”#2:11 నిర్గమ 20:13; ద్వితీ 5:17 అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.
12కాబట్టి మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందబోయే వానిలా మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి. 13ఎందుకంటే దయచూపించనివారి మీద దయ చూపక తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది.
విశ్వాసం, క్రియలు
14నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? 15-16ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం? 17అలాగే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది.
18అయితే ఎవరైనా, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి.”
క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తానని చెప్పవచ్చు. 19దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి.
20వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని#2:20 కొ.ప్రా.ప్ర.లలో మృతము నీకు రుజువులు కావాలా? 21మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా? 22అతని క్రియలు అతని విశ్వాసం కలిసి పని చేశాయి. అతడు చేసిన దాన్ని బట్టి అతని విశ్వాసం సంపూర్ణం అయ్యింది. 23నెరవేరబడిన లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది”#2:23 ఆది 15:6 అనే లేఖనం నెరవేరింది. అలాగే అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. 24ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతని క్రియలనుబట్టి నీతిమంతునిగా పరిగణించడం మీరు చూశారు.
25అలాగే వేశ్యయైన రాహాబు#2:25 యెహో 2:1-21 దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా? 26ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in