యెషయా 13
13
బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం
1బబులోను గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన ప్రవచనం:
2చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి,
కేకలు వేసి వారిని పిలువండి;
ప్రజల ప్రధానులను గుమ్మాల్లో
చేతులతో సైగ చేయండి.
3నేను యుద్ధానికి ప్రతిష్ఠించిన వారికి ఆజ్ఞ ఇచ్చాను;
నా కోపం తీర్చుకోవాలని నా వీరులను పిలిపించాను,
నా విజయాన్ని బట్టి సంతోషించేవారిని పిలిపించాను.
4పెద్ద జనసమూహం ఉన్నట్లుగా
కొండల్లో వస్తున్న శబ్దం వినండి!
దేశాలు ఒక్కటిగా చేరుతునట్లు
రాజ్యాల మధ్య అల్లరి శబ్దం వినండి!
సైన్యాల యెహోవా
యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు.
5దేశాన్ని మొత్తం పాడుచేయడానికి,
యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా,
వారు దూరదేశం నుండి,
ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు.
6యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి;
అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది.
7దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి,
ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది.
8భయం వారిని పట్టుకుంటుంది,
వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి;
స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు.
వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు,
వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి.
9చూడండి, యెహోవా దినం వస్తుంది.
దేశాన్ని పాడుచేయడానికి
దానిలో ఉన్న పాపులను పూర్తిగా నాశనం చేయడానికి
క్రూరమైన ఉగ్రతతో తీవ్రమైన కోపంతో ఆ రోజు వస్తుంది.
10ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు
తమ వెలుగు ఇవ్వవు.
ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు
చంద్రుడు తన వెలుగునివ్వడు.
11దాని చెడుతనం బట్టి లోకాన్ని
వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను.
గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను.
క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను.
12నేను మనుష్యులను స్వచ్ఛమైన బంగారం కంటే కొరతగా,
ఓఫీరు దేశ బంగారం కంటే అరుదుగా ఉండేలా చేస్తాను.
13సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా
ఆయన కోపం రగులుకున్న రోజున
ఆకాశం వణికేలా చేస్తాను;
భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను.
14తరుమబడుతున్న జింకలా,
కాపరి లేని గొర్రెలా,
వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు,
వారు తమ స్వదేశాలకు పారిపోతారు.
15పట్టబడిన ప్రతిఒక్కరు కత్తిపోటుకు గురవుతారు;
బందీగా పట్టబడిన వారందరు ఖడ్గానికి చస్తారు.
16వారి కళ్లముందే వారి పసిపిల్లలు ముక్కలుగా నలుగ కొట్టబడతారు;
వారి ఇల్లు దోచుకోబడతాయి వారి భార్యలు అత్యాచారం చేయబడతారు.
17చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను.
వారు వెండిని లెక్కచేయరు.
బంగారం మీద వారికి ఆసక్తి లేదు.
18వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి;
పసిపిల్లలపై వారు జాలిపడరు.
పిల్లలపై వారు దయ చూపరు.
19అప్పుడు రాజ్యాలకు వైభవంగా,
బబులోనీయుల#13:19 లేదా కల్దీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును
సొదొమ గొమొర్రాల వలె
దేవుడు పడగొడతారు.
20ఇకపై దానిలో ఎవరూ నివసించరు
తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు;
అరబీయులు#13:20 అంటే సంచార జాతులు అక్కడ తమ డేరాలు వేసుకోరు,
గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.
21ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి,
వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి;
గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి
కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.
22దాని కోటలలో హైనాలు,
దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి.
దాని కాలం ముగిసిపోతుంది
దాని రోజులు పొడిగించబడవు.
Currently Selected:
యెషయా 13: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.