YouVersion Logo
Search Icon

గలతీ పత్రిక 3

3
విశ్వాసమా ధర్మశాస్త్ర క్రియలా
1అవివేకులైన గలతీయులారా! మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టారు? యేసు క్రీస్తు మీ కళ్లముందే సిలువ వేయబడినంత స్పష్టంగా వివరించాము. 2ఒక్క విషయాన్ని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను: మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా? 3మీరు ఇంత అవివేకులా? ఆత్మతో ప్రారంభించి, ఇప్పుడు శరీరంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా? 4మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? 5నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్భుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా? 6అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.”#3:6 ఆది 15:6
7కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. 8దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు”#3:8 ఆది 12:3; 18:18; 22:18 అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. 9అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.
10ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని పాటించనివారు శాపగ్రస్తులు.”#3:10 ద్వితీ 27:26 11ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”#3:11 హబ 2:4 12ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధించింది కాదు పైగా “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు”#3:12 లేవీ 18:5 అని అది చెప్తుంది. 13ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యారు. ఎలాగంటే, లేఖనాల్లో, “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే”#3:13 ద్వితీ 21:23 అని వ్రాయబడిన దాని ప్రకారం. 14విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకునేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా వర్తించాలని ఆయన మనల్ని విమోచించారు.
ధర్మశాస్త్రం, వాగ్దానం
15సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యులు చేసిన ఒడంబడికే అయినా దాన్ని స్థిరపరచిన తర్వాత దాన్ని ఎవరూ కొట్టివేయలేరు దానికి ఏమి కలపలేరు. ఇది కూడా అంతే. 16అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “నీ సంతానానికి”#3:16 ఆది 12:7; 13:15; 24:7 అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు. 17నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు. 18ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు.
19అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో ఆ సంతానం వచ్చేవరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. 20అయినప్పటికీ మధ్యవర్తి ఒక్కరికే కాదు, కానీ దేవుడు ఒక్కడే.
21అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చి ఉంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. 22అయితే యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా కలిగిన వాగ్దానం ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, లేఖనం సమస్తాన్ని అందరిని పాపంలో బంధించింది.
దేవుని పిల్లలు
23ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. 24అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. 25అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కాబట్టి మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు.
26కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. 27క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. 29మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in