YouVersion Logo
Search Icon

ప్రసంగి 9

9
అందరికి ఒకే గమ్యం
1దీని అంతటిని పరిశీలించి నేనో నిర్ణయానికి వచ్చాను ఏంటంటే నీతిమంతులు జ్ఞానులు వారు చేసే పనులు దేవుని చేతుల్లో ఉన్నాయని, అయితే వారి కోసం ప్రేమ ఎదురుచూస్తుందా లేదా ద్వేషమా అనేది ఎవరికీ తెలియదు. 2జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి.
మంచివారికి ఎలాగో,
పాపాత్ములకు అలాగే జరుగుతుంది;
ఒట్టుపెట్టుకునే వారికి,
ఒట్టు పెట్టుకోడానికి భయపడేవారికి అలాగే జరుగుతుంది.
3అందరికి ఒకే విధంగా జరగడం సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో చాలా చెడ్డ విషయం. అంతేకాక, మనుష్యుల హృదయాలు చెడుతో నిండి ఉన్నాయి, వారు బ్రతికి ఉన్నప్పుడు వారి హృదయాల్లో పిచ్చి ఉంటుంది, తర్వాత వారు చచ్చినవారితో కలిసిపోతారు. 4బ్రతికి ఉన్నవారి మధ్యలో ఉండే వారికే నిరీక్షణ ఉంటుంది; చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క నయం కదా!
5బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు,
కాని చనిపోయినవారికి ఏమి తెలియదు;
వారికి ఏ బహుమతి లేదు,
వారి పేరు కూడా మర్చిపోతారు.
6వారి ప్రేమ, వారి ద్వేషం
వారి అసూయ చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి;
సూర్యుని క్రింద జరిగే ఏ విషయంలో
వారికిక ఏ భాగం ఉండదు.
7వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు. 8ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో. 9సూర్యుని క్రింద దేవుడు మీకు ఇచ్చిన ఈ అర్థరహితమైన జీవితకాలమంతా మీరు ప్రేమించే మీ భార్యతో జీవితాన్ని ఆస్వాదించండి; ఎందుకంటే ఇది మీ జీవితంలో సూర్యుని క్రింద మీరు పడిన కష్టంలో మీకు లభించే భాగము. 10మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు.
11సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను:
వేగంగా ఉన్నవారే పందెం గెలవలేరు
బలంగా ఉన్నవారే యుద్ధాన్ని జయించలేరు,
జ్ఞానులకు ఆహారం లభించదు
తెలివైన వారికే సంపద ఉండదు
చదువుకున్న వారికి దయ లభించదు;
కాని సమయాన్ని బట్టే అందరికి అవకాశాలు వస్తాయి.
12అంతేకాక, వాటి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు:
చేపలు వలలో పట్టబడినట్లు,
పక్షులు వలలో చిక్కుకున్నట్లు
హఠాత్తుగా వారి మీద పడే
చెడు కాలంలో ప్రజలు చిక్కుపడతారు.
బుద్ధిహీనత కన్నా జ్ఞానం మిన్న
13నేను సూర్యుని క్రింద నన్ను బాగా ఆకట్టుకొన్న జ్ఞానం యొక్క ఈ ఉదాహరణను నేను చూశాను: 14ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు. 15ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు. 16కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు.
17మూర్ఖుల పాలకుడి కేకల కంటే
జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది.
18యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు,
కాని ఒక్క పాపి అనేకమైన మంచి వాటిని నాశనం చేస్తాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in