ప్రసంగి 12
12
1-2కష్ట దినాలు రాకముందే
“వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే
సంవత్సరాలు రాకముందే,
సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే,
వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే,
నీ యవ్వన ప్రాయంలో
నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
3ఆ రోజు ఇంటి కావలివారు వణుకుతారు,
బలిష్ఠులు వంగిపోతారు,
తిరగలి విసిరేవారు కొంతమందే ఉండడంతో పని ఆపివేస్తారు,
కిటికీలో నుండి చూచేవారి దృష్టి మందగిస్తుంది.
4వీధి తలుపులు మూసేస్తారు;
తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది
పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు,
పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి.
5మనుష్యులు ఎత్తైన స్థలాలకు
వీధుల్లో అపాయాలకు భయపడతారు;
బాదం చెట్టు పూలు పూస్తుంది
మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు
ఇక కోరికలు రేపబడవు.
మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు
వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు.
6వెండితాడు తెగిపోక ముందే,
బంగారు గిన్నె పగిలిపోక ముందే,
నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే,
బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే,
నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
7మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది,
ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.
8“అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి.
“ప్రతిదీ అర్థరహితమే!”
ముగింపు
9ప్రసంగి జ్ఞాని మాత్రమే కాదు అతడు ప్రజలకు కూడా జ్ఞానాన్ని అందించాడు. అతడు లోతుగా ఆలోచించి ఎన్నో సామెతలను క్రమపరిచాడు. 10ఈ ప్రసంగి సరియైన మాటలనే చెప్పాడు; అతడు సత్యమైన యథార్థ వాక్కులు వ్రాశాడు.
11జ్ఞానుల మాటలు ములికోలు లాంటివి, సేకరించిన సూక్తులు గట్టిగా దిగగొట్టిన మేకుల వంటివి; అవి ఒక కాపరి చేత ఇవ్వబడ్డాయి. 12నా కుమారుడా, వీటితో పాటు ఇతర వాటి గురించి జాగ్రత్తగా ఉండు.
పుస్తకాల రచనకు అంతం లేదు, అధిక చదువు శరీరానికి అలసట కలిగిస్తుంది.
13ఇవన్నీ విన్న తర్వాత,
అన్నిటి ముగింపు ఇదే:
దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి,
ఇదే మనుష్యులందరి కర్తవ్యము.
14దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు,
దాచబడిన ప్రతి దానిని,
అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తారు.
Currently Selected:
ప్రసంగి 12: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.